Asia Markets Crash: సంచలన నిర్ణయాలతో నిత్యం వార్తల్లో నిలిచే అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ తాజాగా చైనాపై 100% సుంకాన్ని విధిస్తున్నట్లు ప్రకటించి యావత్ ప్రపంచాన్ని ఆశ్చర్యానికి గురిచేశారు. ఒక రకంగా చెప్పాలంటే ఆయన తన నిర్ణయంతో మళ్లీ కంపు లేపారు. వాస్తవానికి ఇది మరోసారి వాణిజ్య యుద్ధ సంకేతాలను రేకెత్తించిందని విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేశారు. ఇక్కడ విశేషం ఏమిటంటే అమెరికా చర్యకు డ్రాగన్ కూడా బలమైన ఎదురుదాడిని ప్రారంభించింది. రెండు అతిపెద్ద ఆర్థిక వ్యవస్థల మధ్య సుంకాల ఉద్రిక్తతల ప్రభావం సోమవారం ఆసియా మార్కెట్లలో స్పష్టంగా కనిపించింది. జపాన్ నుంచి హాంకాంగ్ వరకు మార్కెట్లు అన్నీ గందరగోళంలో పడ్డాయి.
READ ALSO: SIT on Adulterated Liquor Case: నకిలీ మద్యం కేసుపై సర్కార్‌పై కీలక నిర్ణయం.. సిట్ ఏర్పాటు..
జపాన్ నుంచి హాంకాంగ్ వరకు గందరగోళం..
చైనాపై 100% సుంకాన్ని ప్రకటించిన ట్రంప్ నిర్ణయం ప్రభావం సోమవారం ఆసియా మార్కెట్లపై స్పష్టంగా కనిపించిదని మార్కెట్ విశ్లేషకులు చెబుతున్నారు. జపాన్ నుంచి హాంకాంగ్, దక్షిణ కొరియా మార్కెట్లు వారంలోని మొదటి ట్రేడింగ్ రోజున భారీ క్షీణతతో ట్రేడ్ అయ్యాయి. ఒక వైపు నిక్కీ 491.64 పాయింట్లు (1.01% క్షీణతతో) 48,088.80 వద్ద ట్రేడ్ కాగా, హాంకాంగ్‌కు చెందిన హాంగ్ సెంగ్ 534.33 పాయింట్లు (1.98% క్షీణించి) 25,756 స్థాయిలో ట్రేడ్ అయ్యింది. దక్షిణ కొరియా KOSPI ఇండెక్స్ కూడా 38.31 పాయింట్లు (1.06%) తగ్గి 3,572.29 వద్ద ట్రేడ్ అయ్యింది. ఇతర ఆసియా మార్కెట్లు కూడా నష్టాల్లో ట్రేడ్ అయ్యాయి. FTSE 100 (81.93 పాయింట్లు), CAC (123.36 పాయింట్లు), DAX (369.79 పాయింట్లు) ప్రారంభ ట్రేడింగ్‌లో తక్కువగా ట్రేడ్ అయ్యాయి.
భారత్‌లో మిశ్రమ ఫలితాలు..
ఆసియా మార్కెట్లు గందరగోళంలో ఉన్నప్పటికీ, గిఫ్ట్ నిఫ్టీ ప్రారంభమైన వెంటనే పుంజుకుంది. ఇతర ఆసియా మార్కెట్లు, భారత మార్కెట్‌పై ప్రతికూల సెంటిమెంట్‌ను సూచించగా, గిఫ్ట్ నిఫ్టీ బుల్లిష్ ట్రెండ్‌ను సూచిస్తోందని మార్కెట్ వర్గాలు తెలిపాయి. గత వారం భారత స్టాక్ మార్కెట్ కదలిక గురించి మాట్లాడుకుంటే.. సెన్సెక్స్, నిఫ్టీ పెరుగుదలలో కనిపించాయి. వారంలోని ఐదు ట్రేడింగ్ రోజుల్లో బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్ 30 స్టాక్‌లతో కూడిన సెన్సెక్స్ 1,293.65 పాయింట్లు (1.59% ) లాభాన్ని నమోదు చేసింది. సెన్సెక్స్ టాప్-10 అత్యంత విలువైన కంపెనీలలో ఎనిమిదింటి మార్కెట్ విలువ రూ.1.94 లక్షల కోట్లకు పెరిగింది. గత వారం చివరి ట్రేడింగ్ రోజు శుక్రవారం బీఎస్ఈ సెన్సెక్స్ 82,075.45 వద్ద ప్రారంభమైంది. ఆపై ఊపందుకుని 82,654.11కి చేరుకుంది. అయితే ఇది 328.72 పాయింట్లు పెరిగి 82,500.82 వద్ద ముగిసింది. సెన్సెక్స్ లాగానే, నిఫ్టీ కూడా బలమైన పెరుగుదలను చూసింది. 25,167.65 వద్ద ప్రారంభమైన తర్వాత ఇండెక్స్ 25,330.75కి దూసుకెళ్లి 103.55 పాయింట్లు పెరిగి 25,285.35 వద్ద ముగిసింది. తాజా పరిస్థితుల మధ్య సోమవారం ముగిసిన స్టాక్ మార్కెట్లు నష్టాలతో ముగిశాయి. సెన్సెక్స్ 173 పాయింట్ల నష్టంతో 82,327 వద్ద ముగిసింది. నిఫ్టీ 58 పాయింట్ల నష్టంతో 25,227 వద్ద ముగిసింది.
మళ్లీ పెరిగిన అమెరికా-చైనా ఉద్రిక్తతలు..
నవంబర్ 1, 2025 నుంచి చైనా నుంచి దిగుమతి చేసుకునే వస్తువులపై అమెరికా 100% సుంకాన్ని ప్రకటించింది. దీనికి ప్రతిస్పందనగా చైనా బలమైన ఎదురుదాడిని ప్రారంభించింది. చైనా వాణిజ్య మంత్రిత్వ శాఖ ట్రంప్ చర్యను విమర్శలు గుప్పించడంతో పాటు దానిపై అవసరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. “చైనా పోరాడటానికి ఇష్టపడదు, కానీ పోరాడటానికి కూడా భయపడదు, అవసరమైతే అది ప్రతీకారం తీర్చుకుంటుంది” అని చైనా వాణిజ్య మంత్రిత్వ శాఖ నిర్మొహమాటంగా పేర్కొంది.
READ ALSO: Bihar Elections 2025: బీహార్ ఎన్నికల్లో ఫ్యామిలీ వార్.. అభ్యర్థులను ప్రకటించిన లాలూ పెద్ద కుమారుడు!