Akasa Air Pilot’s Salaries: మన దేశ విమానయాన రంగంలోకి కొత్తగా ప్రవేశించిన ఆకాశ ఎయిర్ సంస్థ.. పైలట్ల శాలరీలను భారీగా పెంచటంలో ముందంజలో నిలుస్తోంది. తాజాగా సగటున 60 శాతం హైక్ చేసింది. వైమానిక సేవలను మరింతగా విస్తరించాలనే లక్ష్యంలో భాగంగా ఈ నిర్ణయం తీసుకుంది. దీంతో ప్రస్తుతం 2 లక్షల 79 వేలు మాత్రమే ఉన్న కెప్టెన్ల స్టార్టింగ్ శాలరీ నాలుగున్నర లక్షలకు చేరింది. ఫస్ట్ ఆఫీసర్ల వేతనం లక్షా 11 వేల నుంచి లక్షా 80 వేలకు పెరిగింది. అనుభవం మరియు పని గంటలను బట్టి మరింత వేతనాన్ని అందుకోనున్నారు. కొత్త శాలరీలు అక్టోబర్ నుంచి అమల్లోకి వస్తాయి.
మెటావర్స్ వృద్ధి అంచనా
2030 నాటికి మెటావర్స్ 679 బిలియన్ డాలర్ల విలువైన పరిశ్రమగా ఎదగనుందని ఎవరెస్ట్ గ్రూప్ అనే ఐటీ రీసెర్చ్ సంస్థ అంచనా వేసింది. అయితే ఈ పెరుగుదల ప్రభావం పరోక్షంగా యూజర్ల భద్రత, విశ్వాసాలపై పడనుందని తన నివేదికలో ఆందోళన వ్యక్తం చేసింది. అభ్యంతరకరమైన కంటెంట్, ఆర్థిక మోసాలు, యూజర్ల సెక్యూరిటీకి ప్రమాదాలు పెరిగే అవకాశం ఉందని హెచ్చరించింది. మెటావర్స్ అనేది వర్చువల్ రియాలిటీ మరియు అగ్‌మెంటెడ్ రియాలిటీ టెక్నాలజీలతో క్రియేట్ చేసే ఒక సరికొత్త ఊహాజనిత ప్రపంచమనే సంగతి తెలిసిందే.
‘క్రూడాయిల్’ బెటర్
అంతర్జాతీయ స్థాయిలో క్రూడాయిల్ ధరలు ఏడు నెలల కనిష్టానికి దిగొచ్చాయి. గతవారం ఒక బ్యారెల్ రేటు 90 డాలర్ల లోపే ఉండటం చెప్పుకోదగ్గ విషయం. ఫిబ్రవరి తర్వాత క్రూడాయిల్ ధర ఈ స్థాయిలో తగ్గటం ఇదే తొలిసారి. అయితే ఇదే సమయంలో మన దేశంలో మాత్రం పెట్రోల్, డీజిల్ అమ్మకం ధరలు పెద్దగా మారలేదు. దీనివల్ల ప్రభుత్వ రంగ చమురు సంస్థలు నష్టాల నుంచి కాస్త కోలుకోగలిగాయి. ఖర్చులు పెరుగుతున్నప్పటికీ రికార్డ్ స్థాయిలో ఐదు నెలల పాటు డీజిల్, పెట్రోల్ రేట్లు పెంచకుండా ఉండటంతో ఈ కంపెనీలు నష్టాలను చవిచూసిన సంగతి తెలిసిందే.