బిగ్ బాస్ సీజన్ 5 కథ కంచికి చేరే సమయం ఆసన్నం కావడంతో హౌస్ మేట్స్ మధ్య వాదోపవాదాలు తారాస్థాయికి చేరుకుంటున్నాయి. మరీ ముఖ్యంగా నామినేషన్స్ సమయంలో కెప్టెన్ తప్ప అంతా నామినేషన్స్ కు గురవుతామనే విషయం తెలిసి కూడా, ఎవరి వాదనలు వారు వినిపించే క్రమంలో గట్టిగా అరుచుకుంటూ, వీక్షకుల సహనానికి పరీక్ష పెడుతున్నారు. సోమవారం నామినేషన్స్ సమయంలో సన్నీ, శ్రీరామచంద్ర మధ్య వివాదం చినికి చినికి గాలివానగా మారింది. మధ్యలో మానస్ వచ్చి వారిని వారించాల్సిన పరిస్థితి వచ్చింది. యానీ మాస్టర్ హౌస్ నుండి వెళ్ళిపోవడానికి ‘నువ్వు కారణమంటే – నువ్వు కారణం’ అంటూ ఒకరిని ఒకరు విమర్శించుకున్నారు. ఈసారి అత్యధికంగా ఎక్కువ మంది రవిని నామినేట్ చేశారు. షణ్ముఖ్, సిరి, సన్నీ, కాజల్, మానస్ ఈ ఐదుగురు రవిని నామినేట్ చేయగా; కాజల్ ను రవి, షణ్ముఖ్, శ్రీరామ్ నామినేట్ చేశారు. అలానే శ్రీరామ్ ను కూడా ముగ్గురు (సన్నీ, కాజల్, మానస్) నామినేట్ చేశారు. ఇక సన్నీని ఇద్దరు (రవి, శ్రీరామ్) నామినేట్ చేశారు. చిత్రంగా ప్రియాంక, షణ్ముఖ్, సిరి లను ఒక్కొక్కరే నామినేట్ చేశారు. రవిని నామినేట్ చేసే సమయంలో ఈ హౌస్ లో పెద్ద ఫేక్ నువ్వే అంటూ సన్నీ కామెంట్ చేయగా, ఈ హౌస్ లో తనకు ఇష్టంలేని వ్యక్తి రవి అంటూ కాజల్ ముఖం మీదనే చెప్పేసింది. అలానే శ్రీరామ్ కాజల్, సన్నీ, మానస్ తో చేసిన వాదోపవాదాలు ఒక స్థాయిలో చికాకు తెప్పించాయి. ఏదో రకంగా తమ నిర్ణయమే కరెక్ట్ అని చెప్పడానికి వారంతా ఓవర్ యాక్షన్ చేస్తున్నారనిపించింది.
ఉతపదంగా మారిన బరాబర్!
ఇంటి సభ్యులంతా ‘బరాబర్’ను ఊతపదంగా మార్చేసుకున్నారు. ఒకరిని ఒకరు విమర్శించుకునేప్పుడు, తమ అభిప్రాయాలను నొక్కి చెప్పాలనుకున్నప్పుడు, మరీ ముఖ్యంగా వాదోపవాదాల సమయంలో ‘బరాబర్’ అనే పదాన్ని తరచూ ఉపయోగిస్తున్నారు. నామినేషన్స్ సమయంలో ‘అలా మాట్లాడొద్దు’ అని ఎవరైనా ఇతరులను అనగానే ‘బరాబర్ చెబుతా, బరాబర్ అంటా’ అని నొక్కి మరీ చెబుతున్నారు.
ఇంగ్లీష్ లోనే వాదోపవాదాలు!
గతంలో జరిగిన బిగ్ బాస్ షోలకు దీనికి మధ్య ఓ తేడా స్పష్టంగా కనిపిస్తోంది. నాలుగో షో వరకూ ఎవరైనా ఎక్కువగా ఇంగ్లీష్ లో మాట్లాడితే బిగ్ బాస్ తెలుగులో మాట్లాడమని గట్టిగా చెప్పేవాడు. ఒకవేళ తెలుగు రాకపోతే మిగిలిన హౌస్ మేట్స్ దగ్గర నేర్చుకోమని సలహా ఇచ్చేవాడు. అంతేకాదు ఎక్కువగా ఇంగ్లీష్, హిందీ భాషను ఉపయోగిస్తే, పనిష్మెంట్ కూడా ఇచ్చేవాడు. కానీ ఈసారి ఆ పాలసీని పక్కన పెట్టినట్టు కనిపిస్తోంది. పైగా ఇంటి సభ్యులు ఒకరిని ఒకరు విమర్శించుకునే క్రమంలో ఎక్కువగా ఇంగ్లీష్ భాషనే ఉపయోగిస్తున్నారు. బిగ్ బాస్ సైతం అందుకు అభ్యంతరం చెబుతున్నట్టు లేదు. ఇక మీదట ఇంగ్లీష్ భాష మీద మంచి పట్టుఉండి, ఆ భాషలో వాదనా పటిమ ఉన్నవారికే బిగ్ బాస్ ప్రాధాన్యం ఇచ్చినా ఆశ్చర్యపోనక్కర్లేదనిపిస్తోంది.