బిగ్ బాస్ సీజన్ 5 లో పదో వారం జస్వంత్ హౌస్ నుండి బయటకు వెళ్ళాడు, అంతే తప్పితే ఎలిమినేట్ కాలేదు! మరికొన్ని వైద్య పరీక్షలు చేయాల్సి రావడంతో బిగ్ బాస్ జస్వంత్ ను బయటకు పంపాడు. వారం క్రితం అతనికి వైద్య పరీక్షలు చేసి, సీక్రెట్ రూమ్ లో ఉంచిన బిగ్ బాస్, ఇప్పటికీ అతని ఆరోగ్యంలో మెరుగుదల కనిపించకపోవడంతో ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది. అయితే ఈ వారం నామినేషన్స్ లో ఉన్న ఐదుగురిలో చిట్టచివరిగా మానస్, కాజల్ నిలిచారు. వారిలో ఎవరు ఇంటి నుండి బయటకు వెళ్ళాలనేది చెప్పకుండా, నాగార్జున ఆ సమయంలో జెస్సీని వారి బదులు హౌస్ నుండి బయటకు పంపుతున్నట్టు తెలిపి, హౌస్ మెంబర్స్ ను సర్ ప్రైజ్ చేశాడు. గత సీజన్ లోనూ నోయల్ విషయంలో ఇదే జరిగింది. బిగ్ బాస్ హౌస్ నుండి బయటకు వెళ్తూ, వేదిక మీద నుండి హౌస్ మేట్స్ తో జెస్సీ ఫోన్ లో వ్యక్తిగతంగా సంభాషించాడు. వారం రోజులుగా సీక్రెట్ రూమ్ లో ఉండి తాను గమనించిన విషయాలను వారందరికీ పాజిటివ్ గా జెస్సీ చెప్పడం విశేషం.
జెస్సీకి ముద్దులు పెట్టిన యానీ, సిరి!
జెస్సీ సీక్రెట్ రూమ్ లో గమనించిన అంశాలను ఒక్కొక్కరితో పంచుకున్న విధానం అందరినీ ఆకట్టుకుంది. సన్నీకి ఇండివిడ్యుల్ గా గేమ్ ఆడమని చెప్పిన జెస్సీ, మాసస్ ను సైలెంట్ కిల్లర్ అంటూ సంభోదించాడు. రవికి బాబులా బిహేవ్ చేస్తున్నావంటూ మెచ్చుకున్నాడు. , ఇతరులను నమ్మొద్దంటూ కాజల్ ను హెచ్చరించాడు. యానిని బాగా ఆడుతున్నారని అభినందించాడు. ఈ సందర్భంగా యానీ జెస్సీకి ఫ్లయింగ్ కిస్ ఇవ్వడం విశేషం. అయితే ప్రియాంకకు మాత్రం జెస్సీ గట్టిగానే క్లాస్ పీకాడు. త్యాగాలు ఇక ఆపేయమని సలహా ఇచ్చాడు. టాప్ ఫైవ్ లో శ్రీరామ్ ఉంటాడని చెప్పిన జెస్సీ, కేక్ తినే అర్హత ఉండి కూడా రవి గివ్ అప్ చేయడాన్ని తప్పు పట్టాడు, నీ గేమ్ నువ్వు ఆడు అని హితబోధ చేశాడు. ఇక సిరి తన దగ్గర ఉండాల్సిన డబ్బుల్ని వేరే వాళ్ళకు ఇవ్వడాన్ని జెస్సీ విమర్శించాడు. బాగా ఆడమని సిరిని కోరాడు. ఇదే సమయంలో వారిద్దరి మధ్య ఉన్న అనుబంధం మరోసారి బయటపడింది. కిస్ ఇవ్వమని జెస్సీ కోరగానే, అందరూ ఉన్నారంటూనే సిరి ఫోన్లో జెస్సీకి కిస్ ఇచ్చింది. ఇక చివరగా షణ్ణుతో మాట్లాడిన జెస్సీ… బయటకు వచ్చే ముందు చివరి నాలుగు రోజులు సరిగా ఉండలేకపోయిన విషయాన్ని మరోసారి గుర్తు చేసుకున్నాడు. ఇదే సందర్భంలో షణ్ణు జెస్సీ గురించి రెండు మంచి మాటలు చెప్పాడు. ‘మొదటి వారమే ఎలిమినేట్ కావాల్సిన నువ్వు పది వారాలు ఉండి, అదీ ఎలిమినేట్ కాకుండా మరొకరికి లైఫ్ ఇచ్చి బయటకు వెళ్ళడం గ్రేట్’ అంటూ మెచ్చుకున్నాడు. ఇదే మాటను నాగార్జున సైతం ఆ తర్వాత రిపీట్ చేసి, జెస్సీని అభినందించాడు. మొత్తం మీద జెస్సీని అనారోగ్యం రూపంలో దురదృష్టం వెంటాడి, అతన్ని బిగ్ బాస్ హౌస్ నుండి బయటకు పంపిందనే అనుకోవాలి.