“బిగ్ బాస్ తెలుగు సీజన్-5” స్టార్ట్ అయ్యి మూడు రోజులుగా అవుతోంది. మొదటి వారం ఎలిమినేషన్ కోసం నామినేషన్ ప్రక్రియ బాగానే సాగింది. సరయు, జస్వంత్, రవి, హమిద, మానస్, కాజల్ ఈ ఆరుగురు తొలివారం నామినేషన్ లో ఉన్నారు. అయితే మూడవ రోజు కంటెస్టెంట్స్ కంటెంట్ మీద కాన్సన్ట్రేషన్ చేసినట్టు కన్పించింది. ఎవరికి వారు ఫుల్ గా ప్రిపేర్ అయ్యే ఈసారి హౌస్ లో అడుగు పెట్టినట్టు కన్పిస్తోంది. ఈ మూడు రోజులు జరిగిన ఎపిసోడ్లు చూస్తుంటే ఫస్ట్ ఎలిమినేట్ అయ్యేది ఆ కంటెస్టెంటే అని ప్రచారం జరుగుతోంది. ఆ కంటెస్టెంట్ ఎవరో కాదు జెస్సి.
అసలు జెస్సీ ఎవరు ?
“బిగ్ బాస్ సీజన్ 5″లోకి రాకముందు అసలు జెస్సీ అంటే ఎవరో ఎవరికీ తెలియదు. కానీ బిగ్ బాస్ స్టేజ్ మీద నాగార్జున అతనో సూపర్ మోడల్ అని, ఫ్యాషన్ సర్కిల్స్‌లో హైదరాబాద్ మిలింద్ సోమన్ అని అంటారని, ఆయన నిరంతరాయంగా 36 గంటల పాటు ర్యాంప్ వాక్ నిర్వహించి గిన్నిస్ బుక్ లో తన పేరు మీద రికార్డు క్రియేట్ చేసుకున్నాడని పరిచయం చేశారు. అంతేకాదు అతను ఎంతోమంది మోడళ్లను తయారు చేసినట్టు చెప్పారు. జెస్సి 2018 లో సూపర్ మోడల్ ఇండియా టైటిల్ గెలుచుకున్నాడు. అతని అసలు పేరు జస్వంత్ పడాల. కానీ బిగ్ బాస్ షోలో షణ్ముఖ్ జస్వంత్ కూడా ఉండడంతో అతడిని ఎలాంటి కన్ఫ్యూజన్ లేకుండా జెస్సీ అని పిలుస్తున్నారు ఇంటి సభ్యులు. ఇక బిగ్ బాస్ పరిచయాలు అయ్యాక ఎంతో హుందాగా హౌస్ లోకి అడుగుపెట్టాడు జశ్వంత్.
Read also : కంటెంట్ కోసం కంటెస్టెంట్స్ మైండ్ గేమ్ మొదలెట్టారా!?
అమాయకత్వమా ? అయోమయమా ?
అతన్ని సోమవారం చాలా మంది హౌస్‌మేట్ లు నామినేట్ చేశారు. దీంతో జెస్సి కన్నీళ్లు ఆపుకోలేకపోయారు. పైగా నటరాజ్ మాస్టర్ అతను అమాయకుడని, అలా ఉండకూడదని చెప్పడంతో ప్రేక్షకులు కూడా అతనిపై జాలి పడ్డారు. అయితే తాజా ఎపిసోడ్ లో అతని ప్రవర్తన, యానీ మాస్టర్ రచ్చ ప్రేక్షకులకు చిరాకు తెప్పించింది. చిన్న విషయానికి ఇద్దరూ కావాలని గొడవపడటం బుల్లితెర ప్రేక్షకులకు నచ్చలేదు. పైగా ఇంటి సభ్యులంతా జెస్సిదే తప్పు అని ఎత్తి చూపడం, అతను సారీ చెప్పినా యానీ మాస్టర్ అంత గట్టిగా అరవడం దేనికో ఎవరికీ అర్థం కాలేదు. అయితే జెస్సిది మాత్రం అమాయకత్వమే, అయోమయమో అర్థం కాకుండా ఉంది. అయితే ఏడుస్తున్నాడు… లేదంటే గొడవ పడుతున్నాడు. దీంతో విభిన్న మనస్తత్వాల మధ్య మసలుకోవడానికి అతనికి కావాల్సినంత పరిణతి లేదని ప్రేక్షకులు భావిస్తున్నారు. ఇక ఈ వారం ఎలిమినేట్ అయ్యేది అతనేనని అనుకుంటున్నారు. అయితే ఏం జరుగుతుంది అన్న విషయాన్ని వీకెండ్ వరకూ చెప్పలేం. ఎందుకంటే బిగ్ బాస్ హౌస్ లో రోజురోజుకూ లెక్కలు మారిపోతుంటాయి కదా !