కంటెంట్ కోసం కంటెస్టెంట్స్ మైండ్ గేమ్ మొదలెట్టారా!?

బిగ్ బాస్ సీజన్ 5 లో ఏకంగా 19 మంది కంటెస్టెంట్స్ ఒక చోట చేరడంతో అది ఫిష్ మార్కెట్ ను తలపిస్తోంది. నిజం చెప్పాలంటే… ఈ 19 మందిని గుర్తుపెట్టుకోవడం వ్యూవర్స్ కు అసలు సిసలు టాస్క్ గా మారిపోయింది. పైగా ఒక రోజు జరిగిన సంఘటనలన్నింటినీ కేవలం ఓ గంటకు కుదించడం వీడియో ఎడిటర్స్ కు సైతం పెద్ద టాస్క్ అనే చెప్పాలి. బిగ్ బాస్ హౌస్ లో ఉన్న ప్రతి కంటెస్టెంట్ ను కనీసం ఒక్క ఓ ఐదు నిమిషాలు కూడా చూపించలేని పరిస్థితి నెలకొంది. దాంతో గొంతు పెంచి మాట్లాడే వాళ్ళదే రాజ్యంగా మారిపోయింది. రెండో రోజు అలాంటి వారే ఎక్కువగా ఫోకస్ లోకి వచ్చారు.

Also Read… బిగ్ బాస్ 5 ఫస్ట్ వీక్ ఎలిమినేషన్ నామినేషన్ లో ఆ ఆరుగురు!?

ఆర్జే కాజల్ ను ముందు రోజు నామినేట్ చేసిన లహరి… దానికి వివరణ ఇచ్చే ప్రయత్నం చేసింది. అదే ఆ రోజు ప్రోగ్రామ్ కు లీడ్ గా మారిపోయింది. అయితే ఉదయం ముందు రోజు జరిగిన గ్యాప్ ను ఫిల్ చేసుకుందామని మొదలైన వీరి చర్చ రాత్రి అయ్యే సరికీ వేడెక్కి… కాజల్ కంట నీరు పెట్టుకునే వరకూ వెళ్ళిపోయింది. అలానే లోబోతో సిరి ఉత్తుత్తిగా పడిన గొడవ ‘కంటెంట్‘ కోసమే అన్న ముద్ర పడి వారిద్దరినీ అభాసుపాలు చేసింది. ఇక అక్కడ నుండి బిగ్ బాస్ హౌస్ లో ఎవరు ఏం చేసినా… ‘కంటెంట్‘ కోసమే చేస్తున్నారేమో అనే డౌట్ ప్రతి ఒక్కరిలో కలగడం మొదలైంది. ఓవర్ ఆల్ గా రెండో రోజు టాపిక్ మొత్తం కంటెంట్ చుట్టూనే సాగింది. కాజల్ వర్సెస్ లహరి రచ్చ ఒకవైపు సాగుతుంటే, మరో వైపు జస్వంత్ వర్సెస్ యానీ మధ్య గొడవ పీక్స్ కు చేరింది. చివరకు యానీ మాస్టర్ కంట తడిపెట్టుకుంటూ మంచం ఎక్కాల్సి వచ్చింది.

ఇక రెండో రోజు బిగ్ బాస్ ఇచ్చిన ‘శక్తి చూపరా ఢింబకా‘లో పవర్ రూమ్ కు వెళ్ళే ఛాన్స్ మొదట విశ్వకు దక్కగా, సెకండ్ ఛాన్స్ మానస్ పొందాడు. మొదటి రోజు కాస్తంత లో-ప్రొఫైల్ మెయిన్ టైన్ చేసిన మానస్ రెండో రోజుకు లైమ్ లైట్ లోకి వచ్చేశాడు. పవర్ రూమ్ యాక్సెస్ పొందిన విశ్వ… రవి, ప్రియాను ఎంపిక చేసుకోవడంతో వారు తమ సామానంతా స్టోర్ రూమ్ కు షిఫ్ట్ చేసి, ఒకరి దుస్తులు ఒకరు ధరించి బిగ్ బాస్ హౌస్ లోకి ఎంటర్ అయ్యారు. ప్రియను మగవాళ్ళ దుస్తుల్లో చూడటం బాగానే ఉంది కానీ రవిని మాత్రం లేడీ ఎటైర్ లో చూడటం కాస్తంత కష్టమే. అలానే మానస్… పవర్ రూమ్ లో బిగ్ బాస్ ఇచ్చిన టాస్క్ కు ఆర్జే కాజల్ ను ఎంపిక చేసుకున్నాడు.

దాంతో బిగ్ బాస్ హౌస్ లోని కంటెస్టెంట్స్ అంతా నిద్రపోయిన తర్వాతే కాజల్ పడుకోవాల్సి ఉంటుంది. మరి ఆ టాస్క్ ను కాజల్ ఎంత సక్రమంగా నిర్వర్తిస్తుందో చూడాలి. ఇదిలా ఉంటే గతంలో బిగ్ బాస్ హౌస్ బయట ఉండే స్మోకింగ్ ఏరియాలో నటి ముమైత్ ఖాన్… మగాళ్ళతో కలిసి స్మోక్ చేస్తుండేది… ఇప్పుడు ఆ ప్లేస్ ను సరయు భర్తీ చేసింది. లోబోతో కలిసి సరయు దమ్ముకొడుతూ రిలాక్స్ కావడం సెకండ్ డే జరిగిన స్పెషల్ థింగ్స్ లో ఒకటి. అలానే చనిపోయిన తన తమ్ముడిని తలుచుకుని విశ్వ కంట తడిపెట్టుకోవడం కూడా వ్యూవర్స్ ను కదిలించేలా చేసింది.

రెండో రోజు బిగ్ బాస్ హౌస్ లో విశ్వ, మానస్, సిరి, లోబో, జస్వంత్, యాని, కాజల్, లహరి, ప్రియాంక, రవి, ప్రియా మీదనే కెమెరాలు ఎక్కువ ఫోకస్ పెట్టాయని చెప్పాలి. ‘కంటెంట్ కోసం’ అంటూ మొదలైన ఆరోపణలు అటు కాజల్, ఇటు యాని కంట నీరుపెట్టేలా చేయడం వ్యూవర్స్ ను సైతం ఒకింత బాధకు గురిచేసింది. అయితే… బిగ్ బాస్ హౌస్ లో విశ్వ నటుడు కమల్ హాసన్ ను మించిన నటీనటులూ ఉన్నారన్నది చాలా మంది అభిప్రాయం. కొసమెరుపు ఏమంటే… ఆర్జే కాజల్ కు ఓటేయమంటూ సోషల్ మీడియాలో ఆమె స్నేహితులు ఇప్పటికే ప్రచారం మొదలెట్టేశారు!

Related Articles

Latest Articles

-Advertisement-