బిగ్ బాస్ సీజన్ 5లో పాల్గొన్న కంటెస్టెంట్స్ కు శనివారం నాగార్జున క్లాస్ పీకడం కొన్ని వారాలుగా కామన్ అయిపోయింది. వరెస్ట్ పెర్ఫార్మర్ ఎంపికతో పాటు కెప్టెన్సీ టాస్క్ సందర్భంగా జరుగుతున్న వాదోపవాదాలను కూల్ చేయడానికి, తప్పు చేసిన వారికి ఆ విషయాన్ని సూటిగా చెప్పడానికి నాగార్జున కాస్తంత ఎక్కువ సమయమే తీసుకుంటున్నాడు. శనివారం కూడా అదే జరిగింది.
హౌస్ లోని ఒక్కో మెంబర్ ఫోటోనూ క్రష్ చేస్తూ, వారి ప్లస్ పాయింట్స్, మైనెస్ పాయింట్స్ చెబుతూ ఒక్కో సభ్యుడి ప్రవర్తననూ నాగ్ విశ్లేషించారు. దీనికి ముందు ఫ్రీడమ్ రైస్ బ్రాండ్ ఆయిల్ తో హౌస్ లోని సభ్యులంతా రెండు గ్రూప్స్ గా ఏర్పడి పూరీలు తయారు చేశారు. ఇందులో రవి, యానీ, లోబో, విశ్వ, శ్రీరామ్ ఉన్న గ్రూప్ విజయం సాధించింది. ఇక పరాజయం పాలైన గ్రూప్ లో సిరి, కాజల్, పింకీ, మానస్, జెస్సీ ఉన్నారు. సన్నీ జైలులో ఉండగా, కెప్టెన్ షణ్ముఖ్ ఈ గేమ్ కు సంచాలకుడిగా వ్యవహరించాడు. నిర్ణీత సమయంలో 50 పూరీలను చక్కగా చేసిన యానీ టీమ్ కు షణ్ముఖ్ విజయాన్ని కట్టబెట్టాడు. ఆ సమయంలో రూల్స్ బుక్ చదివి ఒకసారి నిర్ణయం తీసుకోమని సన్నీ, షణ్ముఖ్ తో అన్న మాటలు చినికి చినికి గాలీవానగా మారిపోయాయి. యానీ మాస్టర్ , సన్నీ తీవ్రవాదోపవాదాలు చేసుకున్నారు. అయితే… చివరకు ఇతరులు సర్ది చెప్పడంతో ఇటు యానీ, అటు సన్నీ కూల్ అయ్యారు. ఆ తర్వాత నాగార్జున హౌస్ మేట్స్ ను వారి ప్రవర్తన తెలియచేస్తూ క్రిటిసైజ్ చేసినప్పుడు యానీ… తనను ఒంటరిని చేసి అందరూ గ్రూప్ కట్టి ఆడుతున్నారని వాపోయింది. దానికి నాగ్ పంచతంత్రం లోని కథలను గుర్తు చేసుకోమని హితవు పలికాడు. టాస్క్ గెలవడం కోసం కొందరు ఒక్కోసారి మిత్ర లాభంను, మరోసారి మిత్రభేధంను అనుసరిస్తారని, అటు షణ్ణు, ఇటు సన్నీ చేస్తోంది అదేనని నాగార్జున వివరించాడు.
ఆ తర్వాత హౌస్ మెంబర్స్ తో నిచ్చెన, పాము ఉండే వైకుంఠపాళి ఆటను నాగార్జున ఆడించాడు. ఇందులో కాజల్ ను రవి, విశ్వ, శ్రీరామ్, యానీ మాస్టర్స్ పాముగా పేర్కొన్నారు. ఆ తర్వాత స్థానం సన్నీకి దక్కింది. అతన్ని జెస్సీ, లోబో, సిరి స్నేక్ గా అభివర్ణించారు. ఇక శ్రీరామ్ ను కాజల్ స్నేక్ గా అభివర్ణించగా, లోబోను పింకీ స్నేక్ గా పేర్కొంది. మానస్, షణ్ణు… రవిని స్నేక్ కేటగిరిలో నిలబెట్టగా, సన్నీ షణ్ణును పాముగా అభివర్ణించాడు. మొత్తం మీద నలుగురు నామినేట్ చేసిన కారణంగా కాజల్ ‘నాగినీ ఆఫ్ ద హౌస్’ గా ఎంపికయ్యింది.
మెడలో మోత సరిపోయే సామెత!
శనివారం వైకుంఠపాళీ ఆట తర్వాత నాగార్జున సామెతల మీద పడ్డారు. ఒక్కో బోర్డ్ మీద ఒక్కో సామెతను రాయించి, దానికి తగ్గ వ్యక్తి మెడలో దానిని వేయమని ఒక్కో సభ్యుడినీ నాగార్జున కోరాడు. కుక్కతోక వంకర అనే బోర్డ్ ను సన్నీ, జెస్సీ మెడలో వేయగా, దున్నపోతు మీద వర్షం పడ్డట్టు అనే సామెతను విశ్వ, లోబోకు అప్లయ్ చేశాడు. అబద్ధం ఆడినా అతికినట్టు ఉండాలి అనే సామెతను మానస్ రవికి అన్వయించాడు. ఏమీ లేని ఆకు ఎగిరెగిరి పడుతుందనే సామెత ఉన్న బోర్డ్ ను కాజల్, శ్రీరామ్ మెడలో వేసింది. రాను రాను రాజుగారి గుర్రం గాడిద అయ్యిందనే సామెత కాజల్ కు వర్తిస్తుందని యానీ మాస్టర్ చెప్పింది. కందకు లేని దురద కత్తిపీటకు ఎందుకు అనే సామెత ఉన్న బోర్డ్ ను ప్రియాంక సిరి మెడలో వేసింది. అలానే అంతంత కోడికి అర్థశేరు మసాలా అనే సామెతను కాజల్ కు అన్వయించాడు శ్రీరామ్. పైన పటారం లోన లొటారం అనే సామెత సన్నీకి యాప్ట్ అని జెస్సీ తేల్చిచెప్పాడు. ఏకులా వచ్చి మేకులా మారాడు అనే సామత రవికి సరిగ్గా సరిపోతుందని షణ్ముఖ్ తెలిపాడు. చేతులు కాలాక ఆకులు పట్టుకుని ఏం లాభం అనేది యానికి యాప్ట్ అని లోబో చెప్పాడు. అందని ద్రాక్షపళ్ళు పుల్లనా అనే సామెత షణ్ణుకు వర్తిస్తుందని సిరి చెప్పంది. ఇక చివరగా ఓడ ఎక్కే వరకూ ఓడ మల్లన్న, దిగాక బోడి మల్లన్నా అనే సామెతకు మానస్ సరిపోతాడని రవి చెప్పడంతో సామెతల గొడవ ముగిసిపోయింది. విశేషం ఏమంటే… శనివారం నాగార్జున నామినేషన్స్ లో ఉన్న ఆరుగురిలో ఏ ఒక్కరినీ సేవ్ చేయలేదు. మొత్తం గేమ్ అంతా ఆదివారం ఆరు గంటలకు మొదలవుతుందని, అది దీపావళి స్పెషల్ షో అని ప్రకటించాడు.