సినిమా భాషలో చెప్పుకోవాలంటే… బిగ్ బాస్ సీజన్ 5 అర్థశతదినోత్సవాన్ని పూర్తి చేసుకుంది! 19 మంది సభ్యులతో మొదలైన ఈ షో వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఏదీ లేకుండానే యాభై రోజులు విజయవంతంగా కంప్లీట్ చేసుకుంది. హౌస్ లోకి వచ్చిన వారి నుండి సరయు, ఉమాదేవి, లహరి, నటరాజ్, హమీదా, శ్వేతవర్మ, ప్రియా వెళ్ళిపోగా ఇంకా 12 మంది మాత్రం మిగిలారు. ఇక ఎప్పటిలానే సోమవారం నామినేషన్స్ ప్రక్రియ మొదలైపోయింది. ఈ సారి బిగ్ బాస్ టఫ్ టాస్క్ ఏదీ ఇవ్వకుండా హౌస్ లోని సభ్యుల సెంటిమెంట్ మీద దెబ్బ కొట్టాడు. యాభై రోజులు హౌస్ లో ఉన్న మెంబర్స్ ను అభినందిస్తూనే, వారికి ఇష్టమైన వారి నుండి వచ్చిన లేఖను ఎదుటి వ్యక్తుల కోసం ఎవరెవరు త్యాగం చేస్తారనే పరీక్ష పెట్టాడు. చిత్రం ఏమంటే… ఎవరైతే తమ ఇంటి వారి నుండి వచ్చిన లేఖ క్రష్ కావడానికి సిద్ధపడి, ఎదుటివారికి ఛాన్స్ ఇస్తారో వారు నామినేషన్స్ లోనూ ఉంటారు!
ఈ గేమ్ లో తొలుత శ్రీరామ్, మానస్ జోడీకి లోబో, ప్రియాంక ఫ్యామిలీస్ కు చెందిన లేఖలు అందాయి. ప్రియాంక హౌస్ లోకి వచ్చిన తర్వాత తొలిసారి తన తండ్రి నుండి పాజిటివ్ మెసేజ్ రావడంతో తల్లిదండ్రుల నుండి వచ్చిన లేఖను తనకు ఇవ్వమని లోబోను కోరింది. లోబో తనకు భార్య రాసిన లేఖను క్రష్ చేసి, ప్రియాంకకు ఛాన్స్ ఇచ్చాడు. ఇక రవి, షణ్ముఖ్ జోడీ చేతికి విశ్వ, సిరి లేఖలు వచ్చాయి. ఈసారి సిరి త్యాగం చేసి, విశ్వకు అతని కొడుకు రాసిన లేఖ చదువుకునే అవకాశం ఇచ్చింది. సిరి, యానీ మాస్టర్ చేతికి షణ్ముఖ్, కాజల్ లేఖలు రాగా కాస్తంత నాటకీయ పరిణామాల మధ్య షణ్ముఖ్ తాను త్యాగం చేసి, కాజల్ కు ఛాన్స్ ఇచ్చాడు. ఇక ప్రియాంక, కాజల్ జోడీకి యానీ, మానస్ లేఖలు రాగా, మానస్ త్యాగరాజు అయిపోయి, యానీ మాస్టర్ కు లేఖ చదువుకునే ఛాన్స్ ఇచ్చాడు. విశ్వ, లోబో జోడీకి రవి, శ్రీరామ్ లేఖలు రాగా, రవి ఛాన్స్ శ్రీరామ్ కు ఇచ్చాడు. సన్నీ కెప్టెన్ అయినందున అతనికి డైరెక్ట్ గా అతని తల్లి రాసిన లేఖను బిగ్ బాస్ అందించాడు. ఇక జెస్సీకి అతని ఫ్యామిలీ మెంబర్స్ రాసిన లేఖ చదవాలంటే, ఇప్పటికే సేవ్ అయిన ఎవరో ఒకరు త్యాగం చేయాలని బిగ్ బాస్ కండీషన్ పెట్టాడు. దాంతో శ్రీరామ్, జెస్సీ వారించినప్పటికీ తన లేఖను త్యాగం చేశాడు. అయితే… తన త్యాగం వల్ల శ్రీరామ్ కు ఈ ఛాన్స్ వచ్చింది కాబట్టి, తానో సజెషన్ చేస్తానని రవి మరో ట్రిక్ ప్లే చేయబోతున్నాడు. కానీ షణ్ణు, సిరి దానిని ఖండించారు. ఈ సందర్భాన్ని వేరే దానికి ఉపయోగించవద్దని రవికి సున్నితంగా చెప్పారు. దాంతో రవి మౌనం పాటించాడు.
మొత్తం మీద సోమవారం బిగ్ బాస్ సభ్యులతో సెంటిమెంట్ గేమ్ ఆడి, ఫైనల్‌గా లోబో, సిరి, మానస్, రవి, షణ్ముఖ్, శ్రీరామ్ లను నామినేషన్స్ లో పెట్టాడు.