రామనామము రామనామము రమ్యమైనది రామనామము!!
శ్రీమదఖిల రహస్యమ౦త్ర విశేషధామము రామనామము!!రామ!!
దారినొ౦టిగ నడుచువారికి తోడునీడే రామనామము!!రామ!!
నారదాది మహామునీ౦ద్రులు నమ్మినది శ్రీరామనామము!!రామ!!
కోరి కొలచిన వారికెల్లను కొ౦గుబ౦గరు రామనామము!!రామ!!
పాహి క్రిష్ణాయనుచు ద్రౌపది పలికినది శ్రీరామనామము!!రామ!!
ఆలుబిడ్డల సౌఖ్యమునకన్న అధికమైనది రామనామము!!రామ!!
నీవు నేనను భేదమేమియు లేక యున్నది రామనామము!!రామ!!
దశావతారాల్లో ఏడవ అవతారంగా, రావణ సంహరనార్ధమై, శ్రీరాముడు వసంత రుతువులో చైత్ర శుద్ధ నవమి, గురువారం నాడు పునర్వసు నక్షత్రపు కర్కాటక లగ్నంలో మధ్యాహ్నం 12గంటలకు జన్మించారు. ప్రతి సంవత్సరం ఈ రోజునే శ్రీరామనవమిని పండగలా జరుపుకుంటాం. శ్రీరాముని జన్మదినమైన చైత్రశుద్ధ నవమి నాడు “శ్రీ రామ నవమి”గా పూజలు జరుపుకుంటుంటాం. దేశవ్యాప్తంగా రామునికి పూజలు జరుగుతాయి. శ్రీరామనవమి రోజున వీధులలో పెద్ద పెద్ద తాటాకు పందిళ్ళు వేసి, సీతారామ కళ్యాణం చేస్తారు. శ్రీ రాముడికి అరటి పండ్లంటే ప్రీతికరం. కొలిచేటపుడు అరటిపండ్లతో నివేదన తప్పనిసరి. ఇళ్ళల్లో కూడా యధాశక్తిగా రాముని పూజించి వడపప్పు, పానకం, నైవేద్యం చేసి అందరికీ పంచుతారు. అలానే ఉత్సవాల్లో భాగంగా అన్నదానం నిర్వహిస్తుంటారు. గ్రామాల్లో పేద, ధనిక బేధాలు లేకుండా రాములోరి ప్రసాదంగా స్వీకరించటం పరిపాటి. శ్రీరామ నవమి రోజున సీతారామ కళ్యాణం చేయిస్తే.. సకల శుభాలు చేకూరుతాయి. అష్టైశ్వర్యాలు చేకూరుతాయి.
రామాయణంలో శ్రీరాముడికి వశిష్ట మహర్షి నామకరణం చేశారు. ఇందులో రమంతే యోగినో యత్ర రామ అని ఒక అర్థం అంటే.. యోగీశ్వరులు ఏ దేవుడి నుంచి ఆస్వాదన చెందుతారో వారే రాముడు అని అర్థం. శ్రీరామ నవమి రోజున రామ నామస్మరణ చేయడం వల్ల అనేక రెట్లు పుణ్య ఫలం లభిస్తుందని చాలా మంది నమ్ముతారు. శ్రీ రామ నవమి రోజే సీతారాముల కళ్యాణం జరిగిందని, పట్టాభిషేకం జరిగిందని చెబుతారు. అందుకని తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా సీతారాముల కళ్యాణం నిర్వహిస్తారు. రామ నవమి నాడు ప్రత్యేక పూజలు చేయడం, కళ్యాణం నిర్వహించడం, రామ మంత్రాలు జపించడం వల్ల వెయ్యి రెట్ల ఫలితం కలుగుతుందని విశ్వసిస్తారు.
అంతేకాకుండా రామ నామాన్ని అత్యంత భక్తిశ్రద్ధలతో జపించడం వల్ల అనేక సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుందని పండితులు చెబుతారు. శ్రీ రామ్ జై రామ్ జై జై రామ్ ఈ మంత్రాన్ని పఠించడం వలన అనేక ప్రయోజనాలు లభిస్తాయి. ఇది శత్రువుల నుంచి రక్షణను అందిస్తుంది. ఇది జీవితంలోని క్లిష్టమైన సమస్యల నుంచి కూడా మీకు ఉపశమనం కలిగిస్తుంది. మీకు తీవ్రమైన బాధ ఉంటే, ఉదాహరణకు, ఆరోగ్య అనారోగ్యం లేదా ఆర్థిక సమస్యలు ఉంటే ఈ మంత్రం జపించడం వల్ల సమస్యలన్నీ పరిష్కారమౌతాయని భక్తుల నమ్మకం. “శ్రీరామ జయం” ఈ మంత్రాన్ని జపించడం లేదా రాయడం ద్వారా ప్రతిరోజూ ఒక జపమాల మీ అన్ని ప్రయత్నాలకు విజయాన్ని తెస్తుందని విశ్వాసం.. ఓం దశరథయే విద్మహే సీతా వల్లభయే ధీ- మహి తన్ నో రామః ప్రచోదయాత్ ” ఈ మంత్రాన్ని పఠించడం వల్ల మనస్సు ప్రశాంతతను పొందుతుందట.