తెలుగు రాష్ట్రాల్లో మహాశివరాత్రి వేడుకలు వైభవోపేతంగా జరుగుతున్నాయి. వేకువజాము నుంచే భక్తులు శైవక్షేత్రాలకు చేరుకుని స్వామి వారిని దర్శించుకుంటున్నారు. అభిషేక ప్రియుడైన భోలాశంకరుడికి ప్రత్యేకమైన పూజలు, అభిషేకాలు చేస్తున్నారు. సముద్ర స్నానాలు, నదీ స్నానాలను ఆచరించి భక్తులు స్వామివారిని దర్శించుకుంటున్నారు. శైవక్షేత్రాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. శివనామస్మరణతో ఆలయాలు మారుమ్రోగుతున్నాయి. కాళేశ్వరం ఆలయంలో మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని భక్తుల సందడి నెలకొంది. గోదావరి నదిలో పుణ్యస్నానాలు, ఆలయంలో స్వామి వారికి భక్తులు అభిషేకాలు నిర్వహిస్తున్నారు. సాయంత్రం 4.30 గంటలకు వైభవంగా శ్రీ ముక్తీశ్వర శుభానందల కళ్యాణ మహోత్సవాన్ని అర్చక బృందం నిర్వహించనున్నారు.
రాత్రి సాంస్కృతిక కార్యక్రమలు, మహభిషేకం, లింగోద్భవ పూజ, చండిహవనము పూజలు నిర్వహించనున్నారు. అలాగే దక్షిణాకాశీగా పేరుగాంచి వేములవాడ శ్రీరాజరాజేశ్వర స్వామి వారి ఆలయంలో భక్తులతో కిక్కిరిసిపోయింది. గత రెండు సంవత్సరాలుగా కోవిడ్ కారణంగా మహాశివరాత్రికి వేడుకలు అంతంత మాత్రంగానే జరుగాయి. అయితే ప్రస్తుతం కోవిడ్ కేసులు తగ్గుముఖం పడుతున్న నేపథ్యంలో భక్తులు ఆ లయకారుడిని దర్శించుకునేందుకు అధిక సంఖ్యలో విచ్చేశారు. అయితే శైవక్షేత్రాలలో ఈ రోజు రాత్రి నిర్వహించే లింగోద్భవ ఘట్టానికి అన్ని ఏర్పాటు చేశారు అధికారులు.