ఆరవ రోజు కోటి దీపోత్సవ కార్యక్రమంలో శ్రీ శితికంఠానంద స్వామి, శ్రీ వినిశ్చలానంద స్వామి, శ్రీ సుకృతానంద స్వామి వార్లు ఇన్నేళ్ల నుంచి కోటి దీపోత్సవాన్ని నిర్విరామంగా జరిపిస్తున్న ఎన్టీవీ, భక్తి టీవీ చైర్మన్ నరేంద్ర చౌదరిని అభినందిస్తూ, హిందూ సనాతన ధర్మం గురించి, సంప్రదాయాల గురించి అనుగ్రహభాషణం చేయగా, బ్రహ్మశ్రీ మల్లాప్రగడ శ్రీమన్నారాయణ మూర్తి గారు గరిక ప్రత్యేకత గురించి, సిద్ధి బుద్ధిలు వినాయకుడికి అసలు భార్యలు ఎలా అయ్యారు, కార్తిక మాసంలో వెలిగించే దీపం నుంచి ఏం నేర్చుకోవాలి అనే దాని గురించి ప్రవచనామృతం చేశారు.


ముఖ్య అతిథిగా విచ్చేసిన సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ చైర్మన్ జస్టిస్ శ్రీ ఎల్. నరసింహా రెడ్డి గారు మాట్లాడుతూ కోటి దీపోత్సవాన్ని హైదరాబాద్ నాగరికతలో ఒక భాగంగా చేసిన తుమ్మల నరేంద్ర చౌదరి దంపతులకు కృతజ్ఞతలు తెలుపుతూ, మన సంస్కృతీ సంప్రదాయాలను తర్వాతి తరాలకు తెలియచేయాలని కోరారు. బీజేపీ ఓబీసీ మోర్చా అధ్యక్షులు కె. లక్ష్మణ్ మాట్లాడుతూ.. గత పదేళ్లుగా కోటి దీపోత్సవాన్ని నిర్వహిస్తూ సనాతన ధర్మాన్ని సర్వవ్యాప్తి చేసేలా చేస్తున్న నరేంద్ర చౌదరి దంపతుల్ని ప్రశంశించారు.


వీటితో పాటు వేదికపై కాజీపేట గణపతికి కోటి గరికార్చన, భక్తులతో గణపతి విగ్రహాలకు గరికార్చన, కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక కల్యాణం, ప్రాంగణంలో మూషిక వాహన సేవ జరిగాయి. ఇవికాక ప్రతిరోజూ జరిగే దీప ప్రజ్వలన, బంగారు లింగోద్భవం, మహా నీరాజనం, వచ్చిన అతిథులకు గురు వందనం, గౌరవ సత్కారాలు, సప్త హారతి వంటి కార్యక్రమాలు జరిగాయి.


