Tata Nexon vs Maruti Victoris Crash: టాటా కార్లు నాణ్యతకు ఇప్పటికే మంచి పేరు సంపాదించాయి. ఎన్నో రోడ్డు ప్రమాదాల్లో ప్రయాణికులకు పెద్ద గాయాలు కాకుండా బయటపడ్డారు. కొనుగోలుదారులు భద్రతపై దృష్టి పెడుతుండటంతో ఇటీవలి మారుతి సుజుకి వంటి ఇతర దేశీయ కంపెనీలు సైతం కార్ల భద్రతపై ఎక్కువగా దృష్టి పెట్టడం మొదలుపెట్టాయి. అయితే.. తాజాగా ఉత్తరాఖండ్‌లో జరిగిన ఓ ప్రమాదం ప్రయాణికుల భద్రతపై కంపెనీ ప్రాధాన్యతను చూపించింది. మారుతి విక్టోరిస్, టాటా నెక్సాన్ ఒక మలుపు వద్ద ఢీకొన్నాయి. ఈ ప్రమాదం తర్వాత రెండు కంపెనీల కార్ల భద్రతపై కొత్తగా చర్చ మొదలైంది.
డెహ్రాడూన్ వాలే ఆఫీషియల్ అనే ఇన్‌స్టాగ్రామ్ పేజీలో ఓ వీడియోను పోస్ట్ చేశారు. ఉత్తరాఖండ్‌లోని అల్మోరా ప్రాంతంలో జరిగిన కారు ప్రమాద దృష్యాలు ఈ పోస్ట్‌లో ఉన్నాయి. మొదట మారుతి విక్టోరిస్ కారు వెనుక భాగం నుంచి వీడియోను మొదలు పెట్టారు. ఆ కారు మలుపు వద్ద టాటా నెక్సాన్‌ను ఢీకొట్టినట్టుగా చూపించారు. ప్రమాదానికి గురైన కారు టాటా నెక్సాన్ ఫేస్‌లిఫ్ట్ వెర్షన్‌గా కనిపిస్తుంది. ఈ ప్రమాదంలో టాటా నెక్సాన్ కుడి వైపు ముందు భాగం తీవ్రంగా దెబ్బతింది. బోనెట్‌పై గట్టి ఢీకొట్టిన గుర్తులు స్పష్టంగా కనిపించాయి. ముందు బంపర్, హెడ్‌లైట్లు, ఫెండర్, ఫాగ్ ల్యాంప్స్ అన్నీ బాగా డ్యామేజ్ అయ్యాయి. డ్రైవర్ సైడ్ ముందు చక్రం కూడా దెబ్బతిన్నట్లు కనిపించింది. సాధారణంగా నెక్సాన్ బలమైన బాడీకి పేరుంది. భారీ ప్రమాదాల్లోనూ వాహనం స్వల్ప డ్యామేజ్‌తో బయటపడుతుంది. కానీ ఈ ప్రమాదంలో మాత్రం బలంగా ఢీ కొనడంతో ఎక్కువగానే దెబ్బతింది. ఇక్కడ విచిత్రం ఏంటంటే.. మారుతి సుజుకి విక్టోరిస్ కారుకు తక్కువ నష్టం జరిగింది. దాని బంపర్, హెడ్‌ల్యాంప్, ఫెండర్ మాత్రమే దెబ్బతిన్నాయి. చక్రాలు మాత్రం బాగానే ఉన్నాయి.
READ MORE: Himachal Pradesh: అరుదైన సంఘటన.. 15 ఏళ్ల క్రితం తప్పిపోయిన కొడుకు ప్రత్యక్షం
ఈ ఘటనలోని ప్రమాదానికి గురైంది టాటా నెక్సాన్ పాత మోడల్ కారు. భారత్ NCAP రాకముందే పరీక్షించారు. అప్పట్లో ఇది గ్లోబల్ NCAP క్రాష్ టెస్టుల్లో 5 స్టార్ రేటింగ్ సాధించింది. అయితే అప్పటి పరీక్షల ప్రమాణాలు ఇప్పుడు ఉన్న ప్రమాణాల కంటే భిన్నంగా ఉన్నాయి. ఈ వీడియోలో ఎంత డ్యామేజ్ కనిపించినా, నెక్సాన్ ఇప్పటికీ బలమైన SUVనే నిలుస్తోంది. ఒక్క ప్రమాదం ఆధారంగా నెక్సాన్ అసురక్షితం అని చెప్పడం సరైంది కాదు. దాని భద్రతపై ఇప్పటికే మంచి గుర్తింపు ఉంది. మరోవైపు.. మారుతి సుజుకి విక్టోరిస్ కంపెనీ నుంచి 5 స్టార్ గ్లోబల్ NCAP రేటింగ్ పొందిన తొలి SUVలలో ఒకటి. పెద్దల భద్రతలో 32 పాయింట్లకు గానూ 31.66 పాయింట్లు, పిల్లల భద్రతలో 49కు గానూ 43 పాయింట్లు సాధించింది. రెండు కార్లు కూడా ఇప్పటికీ బలమైన, సురక్షితమైన మోడళ్లుగానే గుర్తింపు పొందాయి. అయితే విక్టోరిస్ కొత్త మోడల్ కావడం వల్ల, ఆధునిక మెటీరియల్స్ వాడటం ద్వారా నిర్మాణ బలం మరింత పెరిగింది.