Tata Motors: భారత ఆటోమేకర్ దిగ్గజం టాటా మోటార్స్ కూడా హ్యుందాయ్, మారుతీ సుజుకీ దారినే అనుసరిస్తోంది. తన వాహనాల ధరలను పెంచుతున్నట్లు టాటా మోటార్స్ ప్రకటించింది. పెరిగిన ధరలు 2025 జనవరి నుంచి అమలులోకి వస్తాయని చెప్పింది. తాజా ప్రకటన ప్రకారం.. తన మోడల్, వేరియంట్‌ల ఆధారంగా 3 శాతం వరకు పెంచనున్నారు. పెట్రోల్, డిజిల్ వాహనాల(ఐసీఈ)తో పాటు ఎలక్ట్రిక్ వాహనాలు(ఈవీ) వాహనాలకు ధరల పెరుగుదల వర్తిస్తుంది. పెరుగుతున్న ఇన్‌పుట్ ఖర్చులు, ద్రవ్యోల్బణం కారణంగా ధరల్ని పెంచుతున్నట్లు చెప్పింది.
Read Also: Supreme Court: “ప్రార్థనా స్థలాల చట్టం”.. మందిర్-మసీదు వివాదాలపై సుప్రీం కీలక ఆదేశాలు..
టాటా మోటార్స్‌లో ఇప్పుడు హ్యాచ్‌బ్యాక్ సెగ్మెంట్‌లో టియాగో, ఆల్ట్రోజ్‌లతో పాటు కాంపాక్ట్ సెడాన్ విభాగంలో టిగోర్, మైక్రో మైక్రో SUV విభాగంలో పంచ్, కాంపాక్ట్ SUV విభాగంలో టాటా నెక్సాన్, ప్రీమియం SUV విభాగంలో హ్యారియర్ మరియు సఫారీ వంటి మోడల్‌లు ఉన్నాయి. దీంతో పాటు కూపే స్టైల్ డిజైన్ కలిగిన కర్వ్‌ని కలిగి ఉంది. ఎలక్ట్రిక్(ఈవీ) వాహన విభాగంలో కర్వ్. ఈవీ, పంచ్. ఈవీ, నెక్సాన్.ఈవీ, టియాగో.టీవీ, టిగోర్.ఈవీలను కలిగి ఉంది. త్వరలోనే హారియర్.ఈవీని, సియోర్రాఈవీని లాంచ్ చేయనున్నట్లు తెలుస్తోంది.
ఇప్పటికే హ్యుందాయ్, మారుతీ సుజుకీ, మహీంద్రా వంటి కార్ మాన్యుఫాక్చర్ కంపెనీలు తన కార్‌ల ధరల్ని పెంచుతూ నిర్ణయం తీసుకున్నాయి. ఈ మార్గంలోనే టాటా నడుస్తోంది. మారుతీ సుజకీ తన వాహనాలపై 4 శాతం, హ్యుందాయ్ మోడల్‌ని బట్టి రూ. 25,000 వరకు పెంచుతున్నట్లు ప్రకటించింది. మహీంద్రా తన ఎస్‌యూవీలపై 3 శాతం వరకు పెంపుని ప్రకటించింది. ఇదే కాకుండా ఆడి, బీఎండబ్ల్యూ, మెర్సిడెస్ బెంజ్ వంటి లగ్జరీ తయారీ సంస్థలు కూడా తమ వాహనాల ధరల్ని పెంచుతున్నట్లు చెప్పింది.