Piaggio Ape: ప్రముఖ వాహన తయారీ సంస్థ పియాజియో వెహికల్స్ ప్రైవేట్ లిమిటెడ్ (PVPL) భారత రవాణా రంగానికి కొత్త ఊతమిస్తూ మరో రెండు సరికొత్త డీజిల్ కార్గో త్రీ-వీలర్లను మార్కెట్లోకి విడుదల చేసింది. సరుకు రవాణా విభాగంలో తన స్థానాన్ని మరింత బలపడే దిశగా ‘ఆపే ఎక్స్‌ట్రా బడా 700’, ‘ఆపే ఎక్స్‌ట్రా 600’ పేర్లతో ఈ కొత్త మోడళ్లను సంస్థ ఆవిష్కరించింది. వీటిలో ముఖ్యంగా ఏప్ ఎక్స్‌ట్రా బడా 700 మోడల్ కార్గో త్రీ-వీలర్లలో సరికొత్త ప్రమాణాలను నెలకొల్పిందని కంపెనీ వెల్లడించింది.
Gold Rates: పసిడి ప్రియులకు మళ్లీ షాక్.. ఈరోజు ఎంత పెరిగిందంటే..!
తొలిసారిగా 7 అడుగుల పొడవైన కార్గో డెక్‌ను అందించే ఈ మోడల్, భారీ బరువులను మోయడానికి అనువైన 750 కిలోల పేలోడ్ సామర్థ్యంతో ప్రత్యేకంగా నిలుస్తోంది. 700 DI డీజిల్ ఇంజిన్, 12 అంగుళాల రేడియల్ టైర్లు, బలమైన ఛాసిస్‌తో దీన్ని తీర్చిదిద్దారు. డ్రైవర్‌కు సౌకర్యవంతంగా ఉండే విశాలమైన క్యాబిన్, 3.5 అంగుళాల డిజిటల్ క్లస్టర్, ఆప్షనల్ రివర్స్ పార్కింగ్ సెన్సార్ వంటి ఆధునాతన ఫీచర్లు ఇందులో లభ్యమవుతున్నాయి. దీనితోపాటు వినియోగదారుల నమ్మకాన్ని పెంచేందుకు పియాజియో 5 ఏళ్ల వారెంటీని అందిస్తోంది.
ఇక తక్కువ ధరలో ఎక్కువ మైలేజ్ కోరుకునే వారికి అనువుగా రూపొందించిన ఏప్ ఎక్స్‌ట్రా 600 కూడా వినియోగదారులను ఆకర్షిస్తోంది. కొత్తగా అభివృద్ధి చేసిన 600 DI డీజిల్ ఇంజిన్‌తో వచ్చే ఈ వాహనం మంచి ఇంధన సామర్థ్యాన్ని అందించడమే కాకుండా.. ఎత్తులను సులభంగా ఎక్కే సామర్థ్యంతో రోజువారీ నగర, చిన్న పట్టణ రవాణాకు ఎంతో సరిపోతుంది. చిన్న వ్యాపారులు, రిటైల్ సరుకు రవాణాదారులు, ఫ్లీట్ ఓనర్లకు ఇది సులువైన, ఖర్చు తగ్గించే పరిష్కారంగా మారుతుందని కంపెనీ చెబుతోంది.
ఈ రెండు మోడళ్లూ నవంబర్ 2025 నుంచి విక్రయాలకు అందుబాటులోకి వచ్చాయి. ఏప్ ఎక్స్‌ట్రా బడా 700 ప్రారంభ ధర రూ. 3.45 లక్షలు, ఏప్ ఎక్స్‌ట్రా 600 ప్రారంభ ధర రూ. 2.88 లక్షలు (ఎక్స్-షోరూమ్)గా నిర్ణయించారు. సరుకు రవాణా రంగంలో పనితీరును మెరుగుపరుచుకోవాలనుకునే చిన్న వ్యాపారులకు, ట్రాన్స్‌పోర్ట్ ఆపరేటర్లకు ఈ కొత్త వాహనాలు మరింత ఆదాయాన్ని తీసుకురావడంలో తోడ్పడతాయని పియాజియో భావిస్తోంది.