ఓలా భారతదేశంలో తన మొదటి B2B ఓరియెంటెడ్ ఎలక్ట్రిక్ స్కూటర్‌ను విడుదల చేసింది. ఈ స్కూటర్ గిగ్, గిగ్+ అనే రెండు వేరియంట్లలో మార్కెట్లోకి వచ్చింది. ఈ రెండు వేరియంట్ల ధర రూ.50 వేల లోపే. వీటి ధరలు రూ.39,999, రూ.49,999గా నిర్ణయించింది. ఈ ఈవీలను సరకుల రవాణా కోసం రూపొందించారు. ఈ స్కూటర్‌లో పొడవైన సీటు ఉంది. దానిపై ఒక వ్యక్తి సులభంగా కూర్చోవచ్చు. ఒక పెద్ద క్యారియర్‌ను కూడా తీసుకెళ్లవచ్చు. దీంతో పాటు ఎస్1 జడ్ (Ola S1 Z) స్కూటర్, ఎస్1 జడ్+ (Ola S1 Z+) స్కూటర్ లను కూడా విడుదల చేసింది. వీటి ధరలు వరుసగా రూ.59,999, రూ.64,999గా నిర్ణయించింది. రూ.499 చెల్లించి వీటిని బుక్ చేసుకోవచ్చని ఓలా తెలిపింది. అయితే.. గిగ్ స్కూటర్లు డెలివరీ వచ్చే ఏడాది ఏప్రిల్ నుంచి, ఎస్1 జడ్ శ్రేణి వాహనాల మే నుంచి ప్రారంభమవుతాయని కంపెనీ తెలిపింది.
ఓలా కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్స్ ఫీచర్లు..
ఓలా గిగ్‌లో 250 వాట్ల మోటారు ఉంది. 1.5 KWh రిమూవబుల్ బ్యాటరీతో వస్తుంది. ఈ స్కూటర్ గంటకు 25 కిమీల వేగంతో నడుస్తుంది. గిగ్ వర్కర్ల కోసం దీన్ని తీసుకొచ్చారు. తక్కువ దూరాల ప్రయాణానికి వీలుగా దీన్ని డిజైన్ చేశారు. దీనికి రిజిస్ట్రేషన్ అవసరం లేదు. సింగిల్ ఛార్జ్‌తో 112 కిలోమీటర్లు దూరం వెళ్తుంది.
ఓలా గిగ్+: ఇది మరింత శక్తివంతమైన ఎలక్ట్రిక్ స్కూటర్. ఈ ఈవీలో 1.5 kW మోటార్ ఉంది. దీని వేగం 45 kmph. ఇది 1.5kWh డ్యూయల్ బ్యాటరీ ప్యాక్‌తో వస్తోంది. సింగిల్ ఛార్జ్‌తో 81 కిలోమీటర్లు ప్రయాణిస్తుంది. దీన్ని కూడా బి2బి కొనుగోళ్లు, రెంటల్స్ కోసం అందుబాటులోకి తేనున్నారు.
ఓలా ఎస్1 జడ్:ఈ స్కూటర్ 1.5kWh చొప్పున డ్యూయల్ బ్యాటరీలతో వస్తోంది. సింగిల్ బ్యాటరీపై 75 కిలోమీటర్లు, రెండు బ్యాటరీలతో 146 కిలోమీటర్ల రేంజ్ ఇస్తుంది. టాప్ స్పీడ్ 70 kmph. ఎల్‌సీడీ డిస్‌ప్లే, ఫిజికల్ కీ అమర్చారు.
ఓలా ఎస్1 జడ్+: ఇది కూడా 1.5kWh డ్యూయల్ బ్యాటరీతో వస్తోంది. ఐడీసీ రేంజ్ 75 కిలోమీటర్లు. రెండు బ్యాటరీలతో అయితే 146 కిలోమీటర్లు. టాప్ స్పీడ్ 70 kmph. ఫిజికల్ కీ, ఎల్‌సీడీ డిస్‌ప్లేతో వస్తోంది. వ్యక్తిగత, కమర్షియల్ వినియోగం కోసం దీన్ని రూపొందించారు.