క్రిస్మస్ సందర్భంగా భవిష్ అగర్వాల్‌కు చెందిన ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ సరికొత్త రికార్డు సృష్టించింది. కంపెనీ దేశవ్యాప్తంగా 3200 కొత్త స్టోర్లను ప్రారంభించింది. దీంతో కంపెనీ మొత్తం స్టోర్ల సంఖ్య 4000కు చేరింది. ఓలా భారతదేశపు అతిపెద్ద ఈవీ పంపిణీదారు కంపెనీగా అవతరించింది. ఈ విషయాన్ని కంపెనీ సీఈవో భవిష్ అగర్వాల్ సోషల్ మీడియా ప్లాట్ ఫాం ఎక్స్ ద్వారా తెలిపారు. ప్రతి షోరూమ్ కు అటాచ్ చేస్తూ సర్వీస్ సెంటర్ ఉండేలా కొత్త స్టోర్లను ఓపెన్ చేసినట్లు పేర్కొన్నారు. కంపెనీ ప్రతి జిల్లా, టౌన్ లో ఉండేటట్లుగా ప్లాన్ చేశామని, బడ్జెట్ ఎలక్ట్రిక్ స్కూటర్ లో లీడింగ్ పొజిషన్ లో ఉంటామని తెలిపారు. ఈ ప్రారంభోత్సవ వేడుకలో లక్ష మందికి పైగా పాల్గొన్నారని వెల్లడించారు.ఇప్పుడు ఓలా ప్రతి భారతీయుడికి అందుబాటులో ఉందని భవిష్ పేర్కొన్నారు.
కొత్త రంగు స్కూటర్..
అంతే కాకుండా.. కొత్త స్టోర్లను ప్రారంభించిన ఓలా క్రిస్మస్ సందర్భంగా కొత్త రంగు ఎలక్ట్రిక్ స్కూటర్‌ను విడుదల చేసింది. కంపెనీ ఓలా ఎస్1 ప్రో గోల్డ్ ఎడిషన్‌ను తీసుకొచ్చింది. ఓలా నిర్వహించే ప్రత్యేక పోటీ ద్వారా ఈ బంగారు రంగు స్కూటర్‌ను గెలుచుకోవచ్చు. ఎలక్ట్రిక్ స్కూటర్ల సేవలకు సంబంధించి ఓలా అనేకసార్లు వినియోగదారుల నుంచి విమర్శలు ఎదుర్కొన్న విషయం తెలిసిందే. ప్రస్తుతం వినియోగదారులకు మెరుగైన సేవలను అందిస్తామని కంపెనీ చెప్పుకొచ్చింది.
కంపెనీ షేర్లు పెరిగాయి
ఇదిలా ఉండగా.. మంగళవారం ఓలా ఎలక్ట్రిక్ షేర్లు 1.53% లాభపడ్డాయి. ఈ పెరుగుదలతో దాని షేర్లు రూ.94.05 వద్ద ముగిశాయి. చాలా రోజుల తర్వాత కంపెనీ షేర్లు పెరిగాయి. అంతకుముందు.. అనేక వివాదాల కారణంగా కంపెనీ షేర్లు గణనీయంగా పడిపోయిన విషయం తెలిసిందే. అయితే.. కంపెనీ షేర్లు ఇప్పటికీ 52 వారాల గరిష్ట స్థాయి రూ.157.53 కంటే చాలా దిగువన ఉన్నాయి.