గత కొన్ని సంవత్సరాలుగా.. ఆస్ట్రియన్ మోటార్ సైకిల్ తయారీదారు కేటీఎం భారతదేశంలో ప్రీమియం మోటార్ సైకిల్ విభాగంపై దృష్టి కేంద్రీకరించింది. గణనీయమైన మార్కెట్ వాటాను సొంతం చేసుకుంది. ఆకట్టుకునే డిజైన్లతో కుర్రకారులో ప్రత్యేక స్థానం సంపాదించుకుంది.. ఈ కంపెనీకి చెందిన కేటీఎం 250 డ్యూక్ భారతదేశంలో అత్యధికంగా అమ్ముడవుతున్న 250cc బైక్స్‌లో ఒకటి. స్థానికంగా తయారు చేయడం, యువ తరం కొనుగోలుదారుల నుంచి ప్రీమియం మోటార్ సైకిళ్లకు పెరుగుతున్న డిమాండ్ కేటీఎం బైక్ ల అమ్మకాలు పెరగడానికి దోహదపడ్తున్నాయి. తాజాగా ఈ బైక్‌ను సొంతం చేసుకోవాలని కలల కనే వారికి సంస్థ అద్భుతమైన ఆఫర్‌ను ప్రకటించింది. నేటి నుంచి రూ.2.25 లక్షలకే బైక్ అందు బాటులోకి రానుంది. గతంలో దీని ధర రూ. 2.45 లక్షలు ఉండేది.
2024 కేటీఎం 250 డ్యూక్ డిజైన్
కొత్త కేటీఎం 250 డ్యూక్ అప్ డేటెడ్ ఫ్రంట్ ప్రొఫైల్ ను కలిగి ఉంది. కెటిఎమ్ 390 డ్యూక్ తో ప్రభావితమైన బూమరాంగ్ ఆకారంలో ఎల్ఈడీ డేటైమ్ రన్నింగ్ లైట్లు ఇందులో ఉన్నాయి. ఇది కాకుండా.. నేకెడ్ స్ట్రీట్ ఫైటర్ మోటార్ సైకిల్ విజువల్ గా అదే స్పోర్టియర్ లుక్ కొనసాగించింది. కొత్త కేటీఎం 250 డ్యూక్ అట్లాంటిక్ బ్లూ, ఎలక్ట్రానిక్ ఆరెంజ్, సిరామిక్ వైట్ అనే మూడు విభిన్న కలర్ ఆప్షన్లలో లభిస్తుంది.
డ్యూక్ టీఎఫ్టీ డిస్ ప్లే..
కొత్త కేటీఎం 250 డ్యూక్ ఇన్ స్ట్రుమెంట్ క్లస్టర్ కోసం కొత్త 5.0-అంగుళాల ఫుల్-కలర్ టీఎఫ్ టీ డిస్ ప్లేతో వస్తుంది. దీనిని కేటీఎం 390 డ్యూక్ నుంచి తీసుకున్నారు. ఈ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ కొత్త గ్రాఫిక్స్ తో వస్తుంది. స్మార్ట్ ఫోన్ కనెక్టివిటీ, టర్న్-బై-టర్న్ నావిగేషన్, హెడ్ సెట్ కనెక్షన్ వంటి ఫీచర్లను కలిగి ఉంది. కేటీఎం కనెక్ట్ యాప్ ద్వారా హెడ్ సెట్ ను ఇన్ స్ట్రుమెంట్ క్లస్టర్ తో జత చేయవచ్చు.
అప్ డేటెడ్ స్విచ్ గేర్
2024 కేటీఎం (ktm) 250 డ్యూక్ స్విచ్ గేర్ ను కూడా అప్ డేట్ చేశారు. ఇది కొత్త ఫోర్-వే మెనూ స్విచ్ లేఅవుట్ తో వస్తుంది. ఇది రైడర్ టీఎఫ్టీ స్క్రీన్ లోని వివిధ నియంత్రణలను యాక్సెస్ చేయడానికి వీలు కల్పిస్తుంది. అనేక ఇతర భాగాల మాదిరిగానే, ఈ స్విచ్ గేర్ ను కూడా డ్యూక్ 390 డ్యూక్ నుండి తీసుకున్నారు.
రైడ్ మోడ్స్
2024 కేటీఎం 250 డ్యూక్ స్ట్రీట్, ట్రాక్ అనే రెండు రైడ్ మోడ్ లతో వస్తుంది. వీటిని రైడర్ తన వీలుకు అనుగుణంగా మార్చుకోవచ్చు. టీఎఫ్ టీ స్క్రీన్ ద్వారా రైడర్ ఈ రెండు మోడ్ ల మధ్య సులువుగా మార్పు చేసుకోవచ్చు. ట్రాక్ మోడ్ లో, టీఎఫ్‌టీ స్క్రీన్ గ్రాఫిక్స్ మరింత రేస్-ఫోకస్డ్ వెర్షన్ గా రూపాంతరం చెందుతాయి. ఇది ఎన్ లార్జ్డ్ రెవ్ కౌంటర్, ల్యాప్ టైమర్, ప్రిఫర్డ్ రైడర్ ఎయిడ్ సెట్టింగ్ లను చూపిస్తుంది.