హీరో మోటోకార్ప్ (Hero MotoCorp) భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్‌పో 2025లో Xoom 125 స్కూటర్‌ని విడుదల చేసింది. కంపెనీ మొత్తం రెండు వేరియంట్లలో ఈ స్కూటర్‌ను పరిచయం చేసింది. ఇందులో VX, ZX ఉన్నాయి. రోజువారీ ప్రయాణీకులకు ఈ స్కూటర్ అత్యుత్తమ ఎంపిక అని కంపెనీ పేర్కొంది. కొత్త Hero Xoom 125 ప్రారంభ ధర రూ. 86,900 (ఎక్స్-షోరూమ్)గా నిర్ణయించారు. ఈ కొత్త స్కూటర్ ఎలా ఉందో చూద్దాం..
లుక్-డిజైన్: కంపెనీ Xoom 125 ను రెండు వేరియంట్లలో పరిచయం చేసింది. ఈ రెండు స్కూటర్ల మధ్య తేడా రంగులు మాత్రమే. VX వేరియంట్ రెండు కలర్ ఆప్షన్‌లలో వస్తుంది (మాట్ స్టార్మ్ గ్రే, మెటాలిక్ టర్బో బ్లూ). టాప్ ZX వేరియంట్‌లో మ్యాట్ నియాన్ లైమ్, ఇన్‌ఫెర్నో రెడ్ వంటి రెండు అదనపు కలర్ ఆప్షన్‌లు ఇచ్చారు. షార్ప్ ఫ్రంట్ ఆప్రాన్, ఇంటిగ్రేటెడ్ ఎల్‌ఈడీ లైట్లు, ఆకర్శించే సైడ్ ప్యానెల్‌తో పాటు వెనుక భాగం కూడా స్పోర్టీ డిజైన్ ఇచ్చారు.
పనితీరు: హీరో Xoom 125లో కంపెనీ 124.6 సీసీ సామర్థ్యం గల సింగిల్ సిలిండర్, ఎయిర్-కూల్డ్ ఇంజన్‌ని అందించింది. ఇది 9.8PS పవర్, 10.4Nm టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజన్ కంటిన్యూయస్లీ వేరియబుల్ ట్రాన్స్‌మిషన్ (CVT) గేర్‌బాక్స్‌తో జత చేశారు. ఈ ఇంజన్ చాలా స్మూత్‌గా ఉందని, మెరుగైన మైలేజీని ఇస్తుందని కంపెనీ తెలిపింది. హార్డ్‌వేర్ గురించి చెప్పాలంటే.. ఇది ముందు వైపున టెలిస్కోపిక్ ఫోర్క్, వెనుక వైపున మోనోషాక్ సస్పెన్షన్‌తో అందించారు. టాప్-ఎండ్ ZX వేరియంట్ ముందు భాగంలో పెటల్ డిస్క్ బ్రేక్‌ను కలిగి ఉంది. అయితే బేస్ VX వేరియంట్‌లో సాధారణ డిస్క్ బ్రేక్‌ను అమర్చారు. ఇది మార్కెట్లోని హోండా యాక్టివా 125 వంటి మోడళ్లతో పోటీ పడుతోంది.
హీరో జూమ్ vs హోండా యాక్టివా:
Xoom స్కూటర్ ఎయిర్-కూల్డ్, 110.9సీసీ ఇంజిన్‌తో వస్తోంది. ఇది 7,250 rpm వద్ద 8.03 bhp, 5,750 rpm వద్ద 8.7 Nm శక్తిని ఉత్పత్తి చేస్తుంది. మరోవైపు, హోండా యాక్టివా 8,000 ఆర్‌పీఎమ్ వద్ద 7.69 బిహెచ్‌పిని, 5,000 ఆర్‌పిఎమ్ వద్ద 8.9 ఎన్ఎమ్ గరిష్ట టార్క్ అవుట్‌పుట్‌ను ఉత్పత్తి చేస్తుంది. రెండు ఇంజన్లు CVT ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌తో జత చేశారు. వీటి ముందు భాగంలో టెలిస్కోపిక్ ఫోర్క్‌లు, వెనుకవైపు మోనోషాక్‌ను ఉపయోగించారు. Xoom ముందు భాగంలో 190 mm డిస్క్ లేదా 130 mm డ్రమ్ అమర్చారు. అయితే వెనుకవైపు 130 mm డ్రమ్ మాత్రమే ఉంది. యాక్టివా ముందు, వెనుక భాగంలో డ్రమ్ బ్రేక్‌తో అందించారు. ఫ్రంట్ వీల్‌లో డిస్క్ లేదు.