మిచౌంగ్ తుఫాను వల్ల ఏపీలో రైతులకు చాలా నష్టం సంభవించిందని టీడీపీ అధినేత చంద్రబాబు తెలిపారు. 15 జిల్లాల్లో 25 లక్షల ఎకరాల్లో పంట నష్టం జరిగిందని.. తుఫాను హెచ్చరికలు చేసినా ప్రభుత్వం నిర్లక్ష్యంగా ఉందన్నారు. హెచ్చరికలను పరిగణనలోకి తీసుకుంటే పంట నష్టం, ప్రాణ నష్టం తగ్గించొచ్చన్నారు. పంట నష్టాన్ని నివారించే పరిస్థితులున్నా.. ప్రభుత్వం ఆ దిశగా చర్యలు తీసుకోలేదని చంద్రబాబు మండిపడ్డారు.
2023-24 ఇంటర్, పదవ తరగతి పరీక్షలు మార్చి నెలలో నిర్వహించనున్నట్లు ఏపీ విద్యా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ వెల్లడించారు. సాధారణ ఎన్నికల షెడ్యూల్ వల్ల పరీక్షలకు ఇబ్బంది లేకుండా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన తెలిపారు.
ఢిల్లీలో కేంద్ర ఎన్నికల సంఘాన్ని వైసీపీ ఎంపీలు కలిశారు. ఎంపీ విజయసాయి రెడ్డి నేతృత్వంలో కేంద్ర ఎన్నికల సంఘాన్ని వైసీపీ ఎంపీలు కలిశారు. ఏపీలో టీడీపీ దొంగ ఓటర్లను చేర్పించిందని ఎంపీలు ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు.
శ్రీకాకుళం జిల్లా పాతపట్నం నియోజకవర్గంలో సామాజిక సాధికారిక యాత్ర బహిరంగ సభలో స్పీకర్ తమ్మినేని సీతారాం ప్రసంగించారు. పాతపట్నంలో ఈ జనవాహిని చూస్తుంటే సముద్రం పొంగివచ్చిందా అన్న రీతిలో హాజరయ్యారన్నారు. పార్టీ పట్ల, జగన్ పట్ల, మీ నాయకురాలి పట్ల అభిమానం కనపడుతోందన్నారు.
అత్యంత భద్రత కల్గిన భారత దేశ పార్లమెంటులో ఆగంతకులు కలకలం సృష్టించిన సమాచారం వినగానే తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యానని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంటరీ చీఫ్, రాజమండ్రి ఎంపీ మార్గాని భరత్ రామ్ తెలిపారు. రాజమండ్రిలో భరత్ మీడియాతో మాట్లాడుతూ.. ఈ సంఘటనపై పూర్తి స్థాయి విచారణ జరపాలని డిమాండ్ చేశారు.
ఇంఛార్జ్‌ల మార్పులతో కొంతమందిలో బాధ, ఆవేదన ఉంటుందని వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి పేర్కొన్నారు. రాబోయే రోజుల్లో అన్ని సర్దుకుంటాయన్నారు. టీడీపీ రాజకీయ పార్టీగా ఉనికి కోల్పోయిందని.. ఒక ముఠాగా మారిందని విమర్శించారు.
కాంట్రాక్టు ఉద్యోగులకు ఏపీ సర్కారు శుభవార్త చెప్పింది. కాంట్రాక్ట్ ఉద్యోగుల రెగ్యులరైజేషన్ గైడ్‌లైన్స్‌ను విడుదల చేసింది. ఈ మేరకు ఆర్థిక శాఖ గైడ్ లైన్స్ జారీ చేసింది. ఈ నెల 15 వ తేదీ నుంచి రెగ్యులరైజేషన్ కోసం కాంట్రాక్టు ఉద్యోగుల నమోదు ప్రక్రియ ప్రారంభం కానుంది.
రాష్ట్రంను హోల్ సేల్‌గా అమ్మేయడం వైసీపీ ప్రారంభించిందన్న జనసేన పీఏసీ కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ వ్యాఖ్యలపై మంత్రి అమర్‌నాథ్ తీవ్రంగా మండిపడ్డారు. జనసేనలో పొలిటికల్ బ్రోకర్ ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ పార్టీ అధినేత అజ్ఞాత వాసి అయితే, ప్రభుత్వం మీద ఆరోపణలు చేస్తున్న వ్యక్తి నాదెండ్ల మనోహర్ అజ్ఞాని అంటూ ఆగ్రహించారు.
శ్రీకాకుళం జిల్లా పాతపట్నం నియోజకవర్గంలో సామాజిక సాధికారిక యాత్ర బహిరంగ సభలో ఎమ్మెల్యే రెడ్డి శాంతి కీలక వ్యాఖ్యలు చేశారు. మహిళల ఆత్మగౌరవం పెంచి, మన అకౌంట్లలో డైరెక్టుగా సంక్షేమ పథకాలు వేసిన ముఖ్యమంత్రి జగన్ అంటూ ఆమె పేర్కొన్నారు.