రాష్ట్రంలో జరిగిన భూ కుంభకోణాలపై సిసోడియా నివేదికపై వచ్చే కేబినెట్‌లో చర్చించి లెక్కలన్నీ బయటపెడతామని, అక్రమాలకు బాధ్యులైన అందరి పైనా చర్యలు ఉంటాయని మంత్రి నారా లోకేష్ తెలిపారు. ఫీజు రీయింబర్స్‌మెంట్‌లో పాత విధానం అమలు చేస్తామని.. సెప్టెంబర్ 11న ముఖ్యమంత్రి సమక్షంలో ఫేజ్ రీయింబర్స్‌మెంట్ అమలు మీద నిర్ణయం తీసుకుంటామన్నారు.
పింఛనుదారులకు ఏపీ ప్రభుత్వ శుభవార్త తెలిపింది. ఈ నెల 31వ తేదీ నాడే పింఛనుదారులకు పింఛన్లు పంపిణీ చేయనున్నట్లు ప్రకటించింది. సెప్టెంబర్ 1వ తేదీ ఆదివారం రావడంతో వృద్ధాప్య, వితంతువు, ఇతర పింఛన్లను ఈ నెల 31వ తేదీనే ఇస్తున్నట్లు మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ప్రకటించారు.
ఏపీలో మద్యం పాలసీ రూపకల్పనకు కేబినెట్ సబ్ కమిటీని నియమిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఐదుగురు మంత్రులతో మద్యం విధానంపై కేబినెట్ సబ్ కమిటీ ఏర్పాటైంది. ఈ సబ్ కమిటీలో సభ్యులుగా మంత్రులు కొల్లు రవీంద్ర, నాదెండ్ల మనోహర్, కొండపల్లి శ్రీనివాస్, సత్యకుమార్ యాదవ్, గొట్టిపాటి రవి కుమార్‌లు ఉండనున్నారు.
ఏపీ రాజధాని అమరావతి ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ (ఏఐ) సిటీగా ఉండాలని, ఆ దిశగా ప్రణాళికలు రూపకల్పన చేయాలని అధికారులకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సూచించారు. పురపాలక శాఖా మంత్రి నారాయణ, సీఆర్డీయే అధికారులతో సీఎం చంద్రబాబు సచివాలయంలో గురువారం సమీక్ష నిర్వహించారు. ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ స్పురణకు వచ్చేలా అమరావతి లోగోను ఆంగ్లంలో అమరావతి పేరులో మొదటి అక్షరం A, చివరి అక్షరం I అక్షరాలు కలిసి వచ్చేలా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సిటీ లోగో రూపొందించాలన్నారు.
మంకీపాక్స్ వ్యాధి నిర్ధారణ కోసం పూర్తి స్వదేశీయంగా విశాఖ మెడ్ టెక్ జోన్ లో ఆర్టీపీసీఆర్ కిట్ అభివృద్ధి చేయడం అభినందనీయమని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. సచివాలయంలో మొట్టమొదటి ఆర్టీపీసీఆర్ కిట్‌ను ముఖ్యమంత్రి ఆవిష్కరించారు.
ముంబై సినీ నటి కాదంబరీ జిత్వానీ వ్యవహారంపై విచారణ అధికారిని బెజవాడ పోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబు నియమించారు. విజయవాడ క్రైమ్ ఏసీపీ స్రవంతిని విచారణ అధికారిగా నియమించారు. ఐపీఎస్ అధికారుల పాత్ర ఉందని వస్తున్న వార్తలపై సమగ్ర విచారణ చేసి నివేదిక ఇవ్వాలనీ సీపీ ఆదేశాలు జారీ చేశారు.
సంపదకు మూలమైన కార్మికుల క్షేమం, సంక్షేమమే కూటమి ప్రభుత్వ ధ్యేయమని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. పరిశ్రమల్లో పనిచేసే కార్మికుల భద్రతకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని చెప్పారు. కార్మిక శాఖ, పరిశ్రమలు, బాయిలర్స్, మెడికల్ సర్వీసెస్ శాఖలపై సచివాలయంలో ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా పలు కీలక నిర్ణయాలు తీసుకున్న సీఎం.. అధికారులకు పలు సూచనలు చేశారు.
తెలుగు వాడినైనందుకు ఎంతో గర్వపడుతున్నానని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు పేర్కొన్నారు. భాషా ప్రాచీనతకు శాసనాలు మూలాధారాలు అని ఆయన తెలిపారు. చక్కటి తెలుగు సాహిత్యానికి పెట్టింది పేరు ప్రొద్దుటూరు అన్న వెంకయ్య... అనేకమంది పండితులు అనేక రచనలు చేసిన వారు ఈ ప్రాంతం వారేనన్నారు. భారతం, భాగవతంలోని ఎన్నో శ్లోకాలకు వ్యాఖ్యానాలు రాసిన రచయితలు ఈ ప్రాంతం వారేనన్నారు.
కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదానికి ఎంతో ప్రత్యేకత ఉంది.. భక్తుల నుంచి భారీ డిమాండ్ ఉంటుంది. అయితే తిరుమల శ్రీవారి భక్తులకు టీటీడీ షాక్ ఇచ్చింది. భక్తులకు కోరినన్ని లడ్డూల జారీ విధానంపై టీటీడీ ఆంక్షలు విధించింది.