ప్రకాశం బ్యారేజీ వద్ద దెబ్బతిన్న గేట్ల మరమ్మతులు పూర్తయ్యాయి. బ్యారేజిలోని 67,69,70 గేట్ల వద్ద దెబ్బతిన్న కౌంటర్ వెయిట్ల మరమ్మతులను పూర్తి చేశారు. దెబ్బతిన్న వాటి స్థానంలో స్టీలుతో తయారు చేసిన భారీ కౌంటర్ వెయిట్లను ఇంజినీర్లు ఏర్పాటు చేశారు.
Srisailam Temple: ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీశైలం ఆలయంలో భక్తులకు విభూదిధారణను ఆలయ ఈవో పెద్దిరాజు పునఃప్రారంభించారు. ఆలయ క్యూలైన్ వద్ద ఆలయంలోనికి ప్రవేశించే భక్తులకు అధికారులు విభూదిధారణ చేస్తున్నారు.
కడప జిల్లాలో వినాయక నిమజ్జనంలో అపశృతి చోటుచేసుకుంది. వియన్‌పల్లి మండలంలోని మొగమూరు వాగులో వినాయక నిమజ్జనంలో ఇద్దరు యువకులు గల్లంతయ్యారు. యువకుల ఆచూకీ కోసం గజ ఈతగాళ్లతో పోలీసులు గాలింపు చర్యలు చేపడుతున్నారు.
కృష్ణా జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. రెండు రోజుల క్రితం మహీంద్రా థార్ కారులో వెళ్తూ గన్నవరం - కేశరపల్లి రూట్‌లో కారుతో సహా గల్లంతైన రియల్ ఎస్టేట్ వ్యాపారి ఫణి.. సోమవారం బుడమేరులో శవమై తేలాడు.
వాయవ్య బంగాళాఖాతంలో వాయుగుండం కొనసాగుతోంది. కళింగపట్నంకి తూర్పున 280 కి.మీ., గోపాల్‌పూర్‌కి తూర్పు-ఆగ్నేయంగా 230 కి.మీ.,పారాదీప్ కి దక్షిణ-ఆగ్నేయంగా 260 కి.మీ , దిఘాకి దక్షిణంగా 390 కి.మీ దూరంలో వాయుగుండం కేంద్రీకృతమై ఉంది. పశ్చిమ వాయవ్య దిశగా కదులుతూ మరింత బలపడి తీవ్ర వాయుగుండంగా మారే అవకాశం ఉంది.
ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్(ఏసీఏ) అధ్యక్షుడిగా ఎంపీ కేశినేని చిన్ని ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఏసీఏ జనరల్ మీటింగ్‌లో అధ్యక్షుడిగా ఎంపీ కేశినేని శివనాథ్ ప్యానల్ ఎన్నికైనట్లు రిటర్నింగ్ అధికారి నిమ్మగడ్డ రమేష్ ప్రకటించారు.
గుంటూరులోని ఆచార్య నాగార్జున యూనివర్సిటీ(ఏఎన్‌యూ)లో విషాదం చోటుచేసుకుంది. పాముకాటుతో మయన్మార్‌కు చెందిన విద్యార్థి కొండన్న ప్రాణాలు కోల్పోయాడు. సమీపంలోని పొలాల వద్ద పుట్టగొడుగుల కోసం వెళ్లిన నేపథ్యంలో పాము కరిచినట్లు సమాచారం.
ఏలూరు జిల్లాలోని కొల్లేరులోకి వరద నీరు భారీగా పెరిగింది. వరద ప్రభావంతో కొవ్వాలంక, పెనుమాకులంక, నందిగామ లంక, మణుగూరు గ్రామాలు నీట మునిగాయి. మునిగిన గ్రామాలకు వెళ్లి ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్ ప్రజల బాగోగులను తెలుసుకుంటున్నారు. కొల్లేరుకు పెరిగిన వరద ఉధృతి కారణంగా ముంపు గ్రామాల ప్రజలను అధికారులు పునరావాస కేంద్రాలకు తరలిస్తున్నారు.