కాకినాడలో సంచలనం సృష్టించిన డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబుపై సస్పెన్షన్ వేటు పడింది. ఆయనను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు బుధవారం సాయంత్రం వైసీపీ ప్రకటించింది. ప్రస్తుతం ఎమ్మెల్సీ అనంతబాబు జ్యుడిషియల్ రిమాండ్‌లో ఉన్నారు. ఇప్పటికే ఈ హత్య కేసులో తన తప్పిదాన్ని అనంతబాబు అంగీకరించినట్లు పోలీసులు వెల్లడించారు.
అనంతబాబు వాంగ్మూలం, ఇప్పటి వరకు సేకరించిన సాంకేతిక ఆధారాలను బట్టి ప్రాథమిక దర్యాప్తులో ఆయనను నిందితుడిగా గుర్తించి అరెస్టు చేశామని కాకినాడ ఎస్పీ రవీంద్రనాథ్‌బాబు స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో నిందితుడిని అరెస్ట్ చేసి కాకినాడ స్పెషల్ మొబైల్ కోర్టు న్యాయమూర్తి ఎదుట హాజరుపరిచి రిమాండ్‌కు తరలించామని తెలిపారు. అటు డ్రైవర్‌ను తాను కావాలనే హత్య చేశానని ఎమ్మెల్సీ అనంతబాబు పోలీసుల విచారణలో ఒప్పుకోవడంతో ప్రతిపక్షాలు విమర్శలు గుప్పించాయి. ఈ నేపథ్యంలో అనంతబాబు పార్టీలో ఉంటే చెడ్డపేరు వస్తుందని గ్రహించిన వైసీపీ అధిష్టానం తాజాగా ఆయనపై సస్పెన్షన్ వేటు విధించింది.