వరదల సమయంలోనూ అధికార ప్రతిపక్ష నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి.. వరద సహాయక చర్యల్లో పాల్గొనడంలేదంటూ.. ఓవైపు అధికార పక్షాన్ని ప్రతిపక్షం విమర్శిస్తే.. మరోవైపు ప్రతిపక్షాన్ని టార్గెట్ చేస్తోంది అధికార పార్టీ.. ఇక, టీడీపీ నేతలపై హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్ చేసిన వ్యాఖ్యలు హాట్ టాఫిక్‌గా మారాయి.. వరదల్లో టీడీపీ నేతలు ఎక్కడా కనపడలేదు… తిండికి తిమ్మరాజు పనికి పోతురాజు అన్నట్టుగా టీడీపీ పరిస్థితి ఉందంటూ ఎద్దేవా చేశారు గోరంట్ల మాధవ్… అయిపోయిన పెళ్లికి పయ్యావుల కేశవ్ మేళం ఊదేందుకు వచ్చినట్లుందంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.. దీంతో.. మాధవ్ వ్యాఖ్యలపై కేశవ్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు.. వరదలపై చర్చ జరుగుతుంటే నాపై వ్యక్తి గతంగా మాట్లాడటం ఏంటి అని మండిపడ్డారు.. అయితే, మంత్రి బొత్స సత్యనారాయణ జోక్యంతో వివాదం సద్దుమనిగింది..
ఇక, అనంతపురంలో వరదలపై సమీక్ష సమావేశం జరిగింది.. జిల్లాలో 50 శాతానికి పైగా పప్పు శనగ పంట నష్టం వాటిల్లిందని అధికారుల వివరణ ఇవ్వగా.. అధికారుల లెక్కలపై పయ్యావుల కేశవ్ అభ్యంతరం వ్యక్తం చేశారు.. ఈ క్రాప్ నమోదు కాకపోవడంపై కేశవ్ మండిపడ్డారు.. పప్పుశనగ సహా పాడైన పంటలను వెంటనే ఈ క్రాప్ నమోదు చేయాలని.. అధికారులు పంటలు వేసినవే 50 శాతం తగ్గించారని ఆరోపించారు. వ్యవసాయ శాఖ కమిషనర్ తో సమీక్ష సమావేశం నుంచే ఫోన్ ల్లో మాట్లాడిన మంత్రి బొత్స.. వెంటనే ఈ క్రాప్ నమోదు చేస్తామని హామీ ఇచ్చారు.. నష్టపోయిన పంటలకు పరిహారం ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు మంత్రి బొత్స.