ఏపీ రాజకీయాలు కాకరేపుతూనే వున్నాయి. ప్రకాశం జిల్లా కొండపి టీడీపీ ఎమ్మెల్యే బాలవీరాంజనేయ స్వామి ఇంటి ముట్టడికి వైసీపీ నేత అశోక్ బాబు ప్రయత్నించడం ఉద్రిక్తతకి దారి తీసింది. ఎమ్మెల్యే స్వామి ఇంటికి కార్యకర్తలతో వెళ్తున్న వైసీపీ నాయకుడు అశోక్ బాబుని పోలీసులు అడ్డుకున్నారు. అయితే పోలీసులను నెట్టుకుంటూ ముందుకు వెళ్లేందుకు అశోక్ బాబు ప్రయత్నించాడు. దీంతో పోలీసులు, వైసీపీ కార్యకర్తల మధ్య తోపులాట జరిగింది. దీంతో 16వ నెంబరు జాతీయ రహదారిపై కొద్దిసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది.
ప్రకాశం జిల్లా మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి 1734 కోట్ల రూపాయలు అవినీతికి పాల్పడ్డాడని నిన్న కొండపి టీడీపీ ఎమ్మెల్యే స్వామి ఆరోపించారు. అయితే ఎమ్మెల్యే స్వామి ఆరోపణలపై మంత్రి బాలినేని స్పందించలేదు. అయితే కొండపి వైసీపీ నాయకుడు అశోక్ బాబు ఎమ్మెల్యే స్వామి ఆరోపణలపై ఆయన ఇంటిని ముట్టడించేందుకు ప్రయత్నించడం వివాదాస్పదం అయింది.
టంగుటూరు నుండి కార్యకర్తలతో కలిసి ఎమ్మెల్యే స్వామి ఇంటి ముట్టడికి బయలు దేరాడు. దీంతో అప్రమత్తమైన పోలీసులు మార్గ మధ్యంలో అశోక్ బాబుని అడ్డుకున్నారు. అయితే పోలీసులను నెట్టుకుంటూ ముందుకు వెళ్లేందుకు అశోక్ బాబు ప్రయత్నించడంతో వైసీపీ కార్యకర్తలు, పోలీసుల మధ్య తోపులాట జరిగింది. ఇరువురి మధ్య తోపులాటతో 16వ నెంబరు జాతీయ రహదారిపై కొద్ది సేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది. అయితే తోపులాటలో అశోక్ బాబు స్పృహతప్పి పడిపోవడంతో వైసీపీ కార్యకర్తలు రోడ్డు పక్కన కూర్చోబెట్టి సపర్యలు చేశారు.
వైసీపీ నేత అశోక్ బాబు కార్యకర్తలతో కలిసి ఎమ్మెల్యే స్వామి ఇంటికి వస్తున్నాడని తెలుసుకుని ఆయన ఇంటి వద్దకు టీడీపీ కార్యకర్తలు భారీగా చేరుకున్నారు. అశోక్ బాబు ఎమ్మెల్యే స్వామి ఇంటికి వస్తే చీర, గాజులు పెడతామంటూ నినాదాలు చేశారు. తమ పార్టీ మంత్రిపై ఆరోపణలు చేసినందుకే ఎమ్మెల్యే స్వామి ఇంటికి వెళ్లేందుకు ప్రయత్నించానని అశోక్ బాబు చెబుతున్నారు. ఇరుపార్టీల కార్యకర్తల మోహరింపుతో టంగుటూరు, నాయుడుపాలెం గ్రామాల్లో కొద్ది సేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఎమ్మెల్యే స్వామి ఇంటి ముట్టడికి యత్నించిన వైసీపీ నాయకుడు అశోక్ బాబుని పోలీసులు అరెస్టు చేయడంతో పరిస్థితి సద్దుమణిగింది. ఈ ఘటనను టీడీపీ అధినేత చంద్రబాబు తీవ్రంగా ఖండించారు.