YS Viveka Murder Case: ఉభయ తెలుగు రాష్ట్రాల్లో వైఎస్ వివేకానందరెడ్డి హత్య సంచలనం సృష్టించిన విషయం విదితమే.. అయితే, వైఎస్ వివేకా హత్య కేసులో ప్రధాన సాక్షిగా ఉన్న వ్యక్తి ఈ రోజు మృతిచెందారు.. వైఎస్ వివేకా కేసులో ప్రత్యక్ష సాక్షిగా ఉన్న వాచ్‌మెన్ రంగన్న ఈ రోజు మధ్యాహ్నం ఆస్పత్రిలో ప్రాణాలు విడిచారు.. రంగన్న వయస్సు 85 సంవత్సరాలు.. వయసు రీత్యా పలు అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్న రంగన్న తీవ్ర అస్వస్థతకు గురవడంతో.. ఆస్పత్రికి తరలించారు పోలీసులు.. అయితే, కడప రిమ్స్ ఆస్పత్రిలో చికిత్సపొందుతూ రంగన్న మృతిచెందారు..
Read Also: Rahul Gandhi: రాహుల్ గాంధీకి భారీ షాక్.. రూ.200 కోట్ల జరిమానా విధించిన కోర్టు..
కాగా, మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి 2019 మార్చి 15వ తేదీన పులివెందులలోని తన నివాసంలో దారుణ హత్యకు గురయ్యారు.. ఆ సమయంలో వివేకా ఇంటి దగ్గర వాచ్‌మెన్‌గా పని చేశారు రంగన్న.. దీంతో, వైఎస్ వివేకా మర్డర్ కేసులో కీలకంగా మారారు. ఈ కేసు దర్యాప్తులో సీబీఐకి ముఖ్యమైన వాంగ్మూలం ఇచ్చారు.. కీలకమైన అంశాలను వెల్లడించారు.. ఇక, వివేకా హత్య కేసులో కీలక సాక్షిగా ఆయన వాంగ్మూలాన్ని నమోదు చేసినట్లు సీబీఐ అప్పట్లో పేర్కొంది.. అంతేకాదు.. ఛార్జిషీట్‌లో కూడా పలు అంశాలను ప్రస్తావించింది. ఆ తర్వాత కొన్ని అనారోగ్య సమస్యలు ఎదుర్కొన్నారు రంగన్న.. ఈ రోజు తీవ్ర అస్వస్థతకు గురికావడం.. ఆస్పత్రికి తరలించడంతో.. చికిత్స పొందుతూ ఆస్పత్రిలోనూ ప్రాణాలు విడిచారు.