Road Accident: క్యాన్సర్‌తో బాధపడుతున్న కొడుకును బతికించుకోడానికి ఊరు కాని ఊరు వెళ్లాడు ఓ తండ్రి.. కానీ, రోడ్డు ప్రమాదంలో.. అది కూడా తండ్రి కళ్ల ఎదుటే.. ఆ కొడుకు కన్నుమూయడంతో ఆయన బాధను వర్ణించడం సాధ్యం కావడం లేదు.. క్యాన్సర్‌నుంచి కొడుకుని రక్షించుకోడానికి ఆస్పత్రుల చుట్టూ తిరిగిన ఆ తండ్రి ఆవేదనను ఆ దేవుడు కూడా ఆలకించలేదు. రోడ్డు ప్రమాదరూపంలో కళ్ల ముందే కొడుకును మరణించడంతో ఆ తండ్రి వేదన చెప్పనలవి కాకుండా ఉంది.
పూర్తి వివరాల్లోకి వెళ్తే.. కడపకు చెందిన పాలది శ్రీహరి కొడుకు హర్షకు 9 ఏళ్లు. రెండేళ్ల నుంచి హర్ష మెటాస్టాటిక్ న్యూరోబ్లాస్టోమా క్యాన్సర్‌తో బాధపడుతున్నాడు. కొడుకు వైద్యానికి ఇప్పటికే కోటిన్నరకుపైగా ఖర్చు చేశారు హర్ష తండ్రి. అయినా, లాభంలేకుండాపోయింది. అయితే, ఉత్తర్ ప్రదేశ్‌లోని మనోనాధామ్‌లో బావిలో నీళ్లు తాగితే క్యాన్సర్ పోతుందని యూట్యూబ్ రీల్స్ లో చూశారు. కొడుకును రక్షించుకోవాలన్న తపనతో గత శనివారం తిరుపతి నుంచి ఢిల్లీకి విమానంలో వెళ్లి అక్కడి నుంచి రోడ్డు మార్గంలో మనోనాధామ్ కు వెళ్లారు. అక్కడికి వెళ్తే మూడు కిలో మీటర్ల క్యూ ఉంది. అది చూసిన ఆ బాలుడు వెనక్కి వెళ్లిపోదాం డాడీ.. ఇక్కడ వద్దు అనడంతో సోమవారం తెల్లవారుజామున క్యాబ్ లో ఢిల్లీ ఎయిర్ పోర్ట్ కు బయల్దేరారు.. మార్గం మధ్యలో తెల్లవారు జామున 3 గంటలలకు గుర్తు తెలియని వాహనం ఢీకొనడంతో హర్ష అక్కడిక్కడే మృతి చెందాడు. ప్రమాదంలో హర్ష తండ్రి తలకు బలమైన గాయంకాగా… ఆయన తమ్ముడు, తమ్ముడు కూతురికి, క్యాబ్ డ్రైవర్ కు గాయాలు అయ్యాయి.