ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సంక్షేమ పథకాలను అమలు చేస్తూ దూసుకుపోతున్నది. రాష్ట్రంలోని పేదలకు ఇప్పటికే ఇళ్ల పట్టాలు మంజూరు చేసిన ప్రభుత్వం ఆ స్థలాల్లో ఇళ్లు నిర్మించి ఇచ్చేందుకు జగనన్న కాలనీల పేరుతో పథకాన్ని ప్రారంభించింది. ఈరోజు నుంచి ఇళ్ల నిర్మాణ కార్యక్రమం మొదలు కాబోతున్నది. సీఎం వైఎస్ జగన్ ఈరోజు వర్చువల్ విధానంలో ఇళ్ల నిర్మాణం కార్యక్రమానికి శ్రీకారం చుట్టబోతున్నారు. మొత్తం 15,60,227 ఇళ్లను నిర్మించబోతున్నారు. ఇందుకోసం ప్రభుత్వం రూ. 28,084 కోట్ల రూపాయలను కేటాయించింది. మూడు దశల్లో ఇళ్లను నిర్మించేందుకు ప్రభుత్వం ప్లాన్ చేస్తున్నది. తొలిదశలో ప్రభుత్వం 8,905 లేఅవుట్లలో 11.26 లక్షల ఇళ్లను నిర్మిస్తున్నది. మరో 4.33 లక్షల ఇళ్ల నిర్మాణానికి లబ్ధిదారులకు ఆర్ధిక సహాయం చేయనున్నది ప్రభుత్వం.