YS Jagan Mohan Reddy Comments On Pawan Kalyan: కాపు నేస్తం మూడో విడత నిధుల విడుదల సందర్భంగా ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మరోసారి జనసేనాధినేత పవన్ కళ్యాణ్‌పై విరుచుకుపడ్డారు. కాపుల ఓట్లను కొంతమేర అయినా మూటగట్టి, మరోసారి చంద్రబాబుకు హోల్‌సేల్‌గా అమ్మేందుకు దత్తపుత్రుడు ప్రయత్నాలు చేస్తున్నాడని పరోక్షంగా పవన్‌ని విమర్శించారు. ప్రస్తుతం రాజకీయాలు మరింత దిగజారిపోయాయని వ్యాఖ్యానించారు. చంద్రబాబు, ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ5 దుష్ట చతుష్టయానికి దత్తపుత్రుడు కూడా తోడయ్యాడని పేర్కొన్నారు.
వాళ్లు (చంద్రబాబును ఉద్దేశించి) తనకు దత్తపుత్రుడు, ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ5 తోడుగా ఉండకపోవచ్చని చెప్పిన జగన్.. ప్రజల దీవెనలు, ఆ దేవుడి ఆశీస్సులు తనకు ఉన్నాయన్నారు. కులం, మతం, ప్రాంతం, వర్గం, పార్టీ అనే తేడాలు లేకుండా తాము సంక్షేమం అందిస్తున్నామని.. అర్హత ఒక్కటే ప్రమాణంగా తీసుకుని మంచి చేస్తున్నామని అన్నారు. మనం డీబీటీ (డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ ఫర్) చేస్తుంటే.. చంద్రబాబు హయాంలో డీపీటీ (దోచుకో, పంచుకో, తినుకో) చేసేవారని ఆరోపించారు. వరద బాధితులల్ని కూడా ఇబ్బంది పడకుండా ఆదుకుంటున్నామని, రేషన్‌తో పాటు ప్రతీ ఇంటికి రూ. 2 వేలు ఇస్తున్నామని వైఎస్ జగన్ చెప్పారు.