Pothula Sunitha: టీడీపీ అధినేత చంద్రబాబుపై వైసీపీ మహిళా అధ్యక్షురాలు పోతుల సునీత తీవ్ర విమర్శలు చేశారు. రాష్ట్రంలో హంతకుడు, దగాకోరు, వెన్నుపోటు దారుడు చంద్రబాబు అని అందరికీ తెలుసన్నారు. రెండు ఎకరాల నుంచి ఇంత ఆస్తిని చంద్రబాబు ఎలా సంపాదించారని ఆమె ప్రశ్నించారు. చంద్రబాబు సంగతి తెలిసే ఆయన నీచ చరిత్రకు ప్రజలు చరమగీతం పాడారని ఆరోపించారు. రాష్ట్రంలో సంక్షేమ పాలన నడుస్తుంటే టీడీపీ నేతలు నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. సామాజిక విప్లవకారుడిలా జగన్ సామాజిక న్యాయం చేస్తుంటే టీడీపీ నేతలకు వెన్నులో వణుకు పుడుతోందని ఎద్దేవా చేశారు.
Read Also: Guinnis Record: గిన్నిస్ రికార్డుల్లో దుబాయ్ రోలర్ కోస్టర్.. ప్రత్యేకత ఏంటంటే..?
అయ్యన్న పాత్రుడు నోరు అదుపులో పెట్టుకోవాలని పోతుల సునీత సూచించారు. లేదంటే బడుగు, బలహీనవర్గాల ప్రజలకు ఆయన బడిత పూజ చేస్తారని హెచ్చరించారు. వంగలపూడి అనిత మాట్లాడితే భారతమ్మ గురించి ప్రస్తావిస్తోందని…రిషికొండకు, ఆమెకు ఏం సంబంధమని ప్రశ్నించారు. ఆమె ఇలానే మాట్లాడితే మహిళలంతా బుద్ధి చెప్పడం ఖాయమన్నారు. టీడీపీ నేతలకు ప్రజలు ఎన్నిసార్లు బుద్ధి చెప్పినా వారిలో మార్పు రావడం లేదన్నారు. యనమల ఒక బీసీ నాయకుడిగా ఇన్నాళ్లు ఎలా కొనసాగాడో అర్థం కావడం లేదన్నారు. వీరు ఎన్ని అడ్డంకులు సృష్టించినా పరిపాలన రాజధాని విశాఖ వెళ్లి తీరుతుందన్నారు. అమరావతి రైతుల యాత్ర దొంగ యాత్ర అని తేలిపోయిందని.. అమరావతి ప్రజలపైనా చంద్రబాబుకు ప్రేమ లేదన్నారు. 2024లో ప్రజలు చంద్రబాబుకు మరోసారి బుద్ధి చెప్పబోతున్నారని పోతుల సునీత జోస్యం చెప్పారు. 14 ఏళ్ల పాలనలో బీసీలకు చంద్రబాబు ఏం చేశారో చెప్పగలరా అని నిలదీశారు. నోరుందని ఇష్టం వచ్చినట్లు మాట్లాడటం సరికాదని.. దమ్ముంటే చర్చకు రావాలన్నారు. మరోసారి వ్యక్తిగత దూషణలకు దిగితే ప్రజలు తరిమికొడతారని హెచ్చరించారు.