సార్వత్రిక ఎన్నికలకు ఇంకా సమయం ఉన్నా ఆంధ్రప్రదేశ్‌లో అప్పుడే ఎన్నికల వాతావరణం కనిపిస్తోంది.. అధికార వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓవైపు.. విపక్షాలు మరోవైపు తగ్గేదేలే..! అనే తరహాలో దూసుకుపోతున్నాయి.. ఈ నేపథ్యంలో కీలక వ్యాఖ్యలు చేశారు టీడీపీ సీనియర్ నేత, పొలిట్‌బ్యూరో సభ్యులు, మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు.. టీడీపీ విస్తృతస్థాయి సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ప్రజలు టీడీపీని గెలిపించేందుకు సిద్దంగా ఉన్నారు.. అభ్యర్థుల ఖరారు విషయంలో చంద్రబాబు వీలైనంత త్వరగా నిర్ణయం తీసుకోవాలన్నారు.. అంతేకాదు, అయ్యన్న గెలవడు అని భావిస్తే సీటు ఇవ్వొద్దు అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.. గతంలో మాదిరిగా మూడు జిల్లాలకు ఓ ఇంఛార్జిని పెట్టాలని సూచించిన ఆయన.. మీరు టెన్షన్ పడొద్దు.. కూల్‌గా ఉండండి.. మాకు సలహాలివ్వండి.. కర్నూల్‌లో మీ ఆవేశం చూసి మేం బాధపడ్డామని పార్టీ అధినేత చంద్రబాబును ఉద్దేశించి మాట్లాడారు.
Read Also: Balakrishna: దెబ్బకి థింకింగ్ మారిపోయింది
ఇక, నాయకులంతా బయటకొచ్చి ప్రభుత్వాన్ని ప్రశ్నించాలని పిలుపునిచ్చారు అయ్యన్నపాత్రుడు.. వైసీపీ ప్రభుత్వాన్ని కూలగొట్టేందుకు అందరి సాయం తీసుకోవాల్సిందే.. రావణ వధకు వానరులు, ఊడత, రావణుని తమ్ముడి సాయం కూడా రాముడు తీసుకున్నాడు… రావణున్ని వధించే శక్తి రాముడికి ఉన్నా.. అందరి సాయాన్ని కోరాడని.. లోక కళ్యాణం కోసం అందరిని రాముడు కూడగట్టాడని గుర్తుచేశారు.. చాలా మంది వైసీపీ నేతలు నాకు ఫోన్ చేసి ప్రభుత్వ విధానాలపై మాట్లాడండని కోరుతున్నారని తెలిపిన ఆయన.. మీరే మాట్లాండని నేను చెబితే.. మాకు ఇబ్బంది ఉందంటున్నారు.. ప్రభుత్వంపై ఆ పార్టీ నేతల్లోనే వ్యతిరేకత ఉందని.. ప్రజల్లోనే అదే కనిపిస్తోందని.. ఎన్నికలు వస్తే.. టీడీపీ అభ్యర్థులను గెలిపించడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారంటూ చెప్పుకొచ్చారు మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు.