ఇటీవల కాలంలో వరుసగా యువతీయువకుల ప్రేమ పలు వివాదాస్పద ఘటనలకు కారణమవుతోంది. తాజాగా ఇలాంటి ఉదంతం మరొకటి వెలుగు చూసింది. ఏపీలోని కర్నూలు జిల్లా మంత్రాలయం మండలంలో ఓ ప్రేమజంట ప్రేమించుకున్నారనే కారణంగా వారి కుటుంబాల మధ్య వైరం ఉద్రిక్త పరిస్థితులకు దారితీసింది. వివరాల్లోకి వెళ్తే.. మంత్రాలయం మండలం మాధవరం గ్రామానికి చెందిన శ్రీజ, శివాజీ అనే యువతీయువకులు ప్రేమించుకున్నారు.
అయితే ఈ విషయం తెలుసుకున్న శ్రీజ కుటుంబసభ్యులు ఆమెకు మూడురోజుల క్రితం రచ్చమర్రికి చెందిన భీమతో వివాహం జరిపించారు. ఈ పెళ్లి ఇష్టం లేని శ్రీజ తన ప్రియుడు శివాజీతో కలిసి గ్రామం నుంచి వెళ్లిపోయింది. దీంతో శ్రీజ కుటుంబం శివాజీ కుటుంబంపై వైరం పెంచుకుంది. ఈ నేపథ్యంలో ఆదివారం నాడు శివాజీ ఇంటిపై శ్రీజ కుటుంబసభ్యులు దాడి చేసి నిప్పు పెట్టారు. ఈ ఘటనలో శివాజీ ఇంటిలోని ధాన్యం, బట్టలు అగ్నికి ఆహుతయ్యాయి. దీంతో మాధవరంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. సమాచారం అందుకున్న పోలీసులు గ్రామంలో భారీగా మోహరించారు. అయితే తమపై శ్రీజ బంధువులు దాడి చేస్తారన్న భయంతో శివాజీ కుటుంబీకులు పారిపోయినట్లు తెలుస్తోంది.