Deputy CM Pawan: పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం డీఎస్పీ జయసూర్య వ్యవహారాలపై రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ కి అనేక ఫిర్యాదులు వచ్చాయి. దీంతో భీమవరం డీఎస్పీ పరిధిలో పేకాట శిబిరాలు పెరిగిపోయినట్లు, సివిల్ వివాదాలలో సదరు అధికారి జోక్యం చేసుకుంటున్నారని, కొందరి పక్షం వహిస్తూ కూటమి నేతల పేరు వాడుతున్నారనే తరహా ఫిర్యాదులు డిప్యూటీ సీఎం పవన్ దృష్టికి వచ్చాయి. ఇక, ఈ విషయంపై పశ్చిమ గోదావరి జిల్లా ఎస్పీతో ఈ అంశంపై ఫోన్ లో పవన్ కళ్యాణ్ మాట్లాడారు. తన దృష్టికి వచ్చిన ఫిర్యాదులు ప్రస్తావించి డీఎస్పీ వ్యవహార శైలిపై నివేదిక పంపించాలని ఆదేశాలు జారీ చేశారు.
Read Also: President of India Building: శబరిమలలో అధికారిక రాష్ట్రపతి భవన్.. నేపథ్యం ఇదే..!
ఇక, అసాంఘిక వ్యవహారాలకు డీఎస్పీ స్థాయి అధికారి అండగా ఉండటాన్ని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తీవ్రంగా ఖండించారు. పోలీసులు సివిల్ వివాదాల్లో తలదూర్చకుండా చూడాలన్నారు. ఈ తరహా వ్యవహారాలను కూటమి ప్రభుత్వం ఉపేక్షించదనే విషయాన్ని సిబ్బందికి తెలియజేయాలన్నారు. ప్రజలందరినీ సమదృష్టితో చూసి శాంతి భద్రతలను పరిరక్షించాలని దిశానిర్దేశం చేశారు. అలాగే, భీమవరం డీఎస్పీపై వచ్చిన ఆరోపణలను రాష్ట్ర హోం శాఖ మంత్రి అనితకు, రాష్ట్ర డీజీపీకి తెలియజేయాలని అధికారులకు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు.