ఏపీకి మరో మూడు రోజుల పాటు భారీ వర్షాలు ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. నిన్న దక్షిణమధ్య బంగాళాఖాతంలో ఉన్న ఉపరితల ఆవర్తనం ఈరోజు నైరుతి బంగాళాఖాతం మరియు పరిసర ప్రాంతమైన ఆగ్నేయ బంగాళాఖాతంలో సగటు సముద్ర మట్టానికి 4.5 కిలోమీటర్లు ఎత్తులో విస్తరించి ఉందని పేర్కొంది వాతావరణ శాఖ. దీని ప్రభావంతో రాగాల 24 గంటల్లో నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడవచ్చునని తెలిపింది.
ఇది పశ్చిమ వాయువ్య దిశలో ప్రయాణించి శ్రీలంక మరియు దక్షిణ తమిళనాడు తీరమునకు చేరుకొనే అవకాశముందని వెల్లడించింది. పై ఉపరితల ఆవర్తనమునకు అనుభందముగా ఉపరితలద్రోణి నైరుతి బంగాళాఖాతం మరియు పరిసర ప్రాంతమైన ఆగ్నేయ బంగాళాఖాతం నుండి దక్షిణ తమిళనాడు వరకు సగటు సముద్ర మట్టానికి 1.5 కిలోమీటర్లు ఎత్తులో విస్తరించి ఉంది. వీటి ఫలితంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాగల మూడు రోజుల వరకు వర్షాలు ఉన్నట్లు వాతావరణ శాఖ స్పష్టం చేసింది. ముఖ్యంగా రాయలసీమ జిల్లాల్లో ఉరుములతో కూడిన వర్షాలు ఉన్నట్లు పేర్కొంది వాతావరణశాఖ.