Tirupathi: ఏపీలో మాండూస్ తుఫాన్ అల్లకల్లోలం సృష్టిస్తోంది. తుఫాన్ ప్రభావం కారణంగా రాష్ట్రంలోని చిత్తూరు, నెల్లూరు, ప్రకాశం, గుంటూరు, కృష్ణా జిల్లాలలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. తుఫాన్ దాటికి శ్రీకాళహస్తి సమీపంలోని తొట్టంబేడు పోలీస్ స్టేషన్ నీట మునిగింది. ఈ సందర్భంగా స్టేషన్‌లోని అన్ని గదుల్లోకి వర్షం నీరు భారీగా చేరింది. దీంతో పోలీసులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. అనంతరం స్టేషన్‌లోకి వచ్చిన నీటిని మోటార్ల ద్వారా తొలగించారు. ఈ మేరకు పోలీస్ స్టేషన్ నీటి మునిగిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కాగా శనివారం ఒక్కరోజే తొట్టంబేడులో 200 మిల్లీమీటర్ల మేర వర్షపాతం నమోదైనట్లు వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు.
Read Also: Mandous Cyclone : కర్ణాటకలో మాండూస్ ఎఫెక్ట్.. బెంగళూరుకు ఎల్లో అలర్ట్
కాగా మాండూస్ తుఫాన్ నేపథ్యంలో చిత్తూరు, తిరుపతి, అన్నమయ్య జిల్లాల కలెక్టర్లతో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. సహాయక చర్యలు, పునరుద్ధరణ విషయంలో ఎలాంటి అలసత్వం లేకుండా చూడాలని అధికారులకు సూచించారు. వీలైనంత త్వరగా ఎన్యుమరేషన్ పూర్తి చేసి నష్టపోయిన వారికి పరిహారం అందించేలా చూడాలని ఆదేశించారు. తుఫాన్ ప్రభావంపై ఎప్పటికప్పుడు సీఎం జగన్ సమీక్షిస్తున్నారని వివరించారు. రిలీఫ్ క్యాంప్‌లలో ఉన్నవారికి సీఎం ఆదేశాల మేరకు వెయ్యి రూపాయలు నగదు సహాయం అందించాలని తెలిపారు.