Pydithalli Ammavaru Sirimanotsavam 2025: ఉత్తరాంధ్ర ఇలవేల్పు పైడితల్లి అమ్మవారి సిరిమానోత్సవం నిర్వహించేందుకు సిద్ధం అయ్యారు అధికారులు.. నేడు సిరిమానోత్సవం జరగనున్న నేపథ్యంలో.. ప్రత్యేక ఏర్పాట్లు చేశారు ఆలయ అధికారులు.. పైడితల్లి అమ్మవారిని దర్శించుకునేందుకు బారులు తీరారు భక్తులు.. మరోవైపు.. భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఉండేలా క్యూ లైన్లలో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.. భారీ సంఖ్యలో పోలీసులను మొహరించారు.. హుక్కుం పేటలో సిరిమానుకు పసుపు కుంకాలు సమర్పించుకుంటున్నారు భక్తులు.. పైడితల్లి అమ్మావారి సిరిమానోత్సవ సందర్భంగా నగరపాలక సంస్థ ప్రత్యేక ఏర్పాట్లు చేసింది.. నగరపాలిక పరిధిలో బయో మరుగుదొడ్లు సిద్ధం చేశారు.. ఉత్సవాలు జరిగే వేదికలతో పాటు జాతరకు సంబంధించిన ప్రధాన కేంద్రాల వద్ద టాయిలెట్లను అందుబాటులో ఉంచారు అధికారులు.. పారిశుద్ధ్య పనులకు అదనంగా నియమించారు.. వీరంతా మూడు షిఫ్టుల్లో పనిచేయనున్నారు.. క్యూలైన్లలో భక్తుల కోసం ఎక్కడికక్కడ నీళ్లను అందిస్తున్నారు.. ఇక, పైడితల్లి సిరిమానోత్సవంలో భాగంగా.. ఇవాళ అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించారు అనువంశక ధర్మకర్త పూసపాటి అశోక్ గజపతి రాజు..
Read Also: SSMB29 : జక్కన్న స్పెషల్ ప్లాన్.. మహేష్-ప్రియాంక చోప్రా ఫోక్ సాంగ్ రెడీ!
ఇక, చీకటి పడకముందే సిరిమానోత్సవాన్ని ముగించాలని ప్రణాళికలు సిద్ధం చేస్తు్న్నారు అధికారులు.. మధ్యాహ్నం 3 గంటలకు ప్రారంభమయ్యేలా ఏర్పాట్లు చేస్తున్నారు. ఉత్తరాంధ్ర ఇలవేల్పు, కోర్కెలు తీర్చే కల్పవల్లి పైడిమాంబ సిరిమానోత్సవం తిలకించడం ఓ అనుభూతి. అమ్మవారి ప్రతిరూపంగా సిరిమాను అధిరోహించే పూజారి బంటుపల్లి వెంకటరావు ఈ రోజు తొమ్మిదో సారి సిరిమానుపై నుంచి భక్తులను ఆశీర్వదించనున్నారు. హుకుంపేటకు చెందిన వెంకటరావు ఇప్పటి వరకు 8 సార్లు సిరిమాను అధిరోహించారు. ఇక, వెంకటరావు తండ్రి బంటుపల్లి బైరాగినాయుడు 27 సార్లు సిరిమానును అధిరోహించారు.. పూర్వం నుంచి పతివాడ, బంటుపల్లి వారసులే సిరిమానుపై కూర్చోవడం ఆనవాయితీగా వస్తున్న విషయం విదితమే..
ఉదయం 10.30 గంటలకు సిరిమాను రథం హుకుంపేటలో బయలుదేరి అమ్మవారి ఆలయానికి చేరుకోవాలని, అక్కడ రథం ఏర్పాట్లు పూర్తి చేసి 3 గంటలకు సిరిమాను ఊరేగింపు ప్రారంభించేలా చూడాలని సూచించారు అధికారులు.. మరోవైపు, సిరిమానోత్సవం కోసం ప్రత్యేక భద్రతా ఏర్పాట్లు చేశామని తెలిపారు ఎస్పీ ఏఆర్ దామోదర్.. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా 120 సీసీ కెమెరాలు, 12 డ్రోన్‌లతో నిఘా పెట్టామన్నారు.. ఇక, డాగ్, బాంబు స్క్వాడ్ బృందాలతో తనిఖీలు చేపట్టినట్లు వెల్లడించారు.. కమాండ్ కంట్రోల్ రూంలో అధికారులు, సిబ్బంది అప్రమత్తంగా వ్యవహరించాలని ఆదేశించారు ఎస్పీ..