Botsa Satyanarayana: శాసనమండలి విపక్ష నేత, వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ సంచలన ఆరోపణలు చేశారు.. పైడితల్లి పండుగలో తనని అవమానించాలనో.. అంతమొందించాలనో కుట్ర చేశారా అని అధికారుల తీరుపై మండిపడ్డారు. ప్రోగ్రాం షెడ్యూల్ ఇచ్చాం.. కానీ, అది పట్టించుకోలేదు.. ఇది కుట్రతో జరిగిందా..? లేక అధికారుల అలసత్వమా? మమ్మల్ని అవమానించాలన్న ఉద్దేశమా? లేక అంతమొందించాలన్నదా? అని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
Read Also: UP: 48 గంటల్లో 20 ఎన్‌కౌంటర్లు..! నేరస్థులను ఏరి పారేస్తున్న సీఎం యోగి..
పైడితల్లి అమ్మవారి పండుగ నిర్వహణలో అవకతవకలు జరిగాయంటూ మండలి పక్ష నేత, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ తీవ్రంగా మండిపడ్డారు. పైడితల్లి అమ్మవారి జాతరలో ప్రభుత్వం ప్రమాణాలు పాటించలేదని, సంప్రదాయాలను పక్కనబెట్టి అహంకారంతో వ్యవహరించారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ప్రాంత ప్రజలందరికీ పైడితల్లి అమ్మవారు ఇలవేల్పుగా ఉన్నారు. ఏ రాజకీయ పార్టీ కూడా ఈ ఉత్సవాల సమయంలో రాజకీయాలు చేయదు.. కానీ, ఈసారి అధికారంలో ఉన్న ప్రభుత్వం, అధికారులు సంప్రదాయాలను తుంచేశారు అని బొత్స విమర్శించారు. అధికారుల నిర్లక్ష్యాన్ని ప్రస్తావిస్తూ, ఎమ్మార్వో, ఎండీవో, ఎక్సైజ్, ఇలా అన్ని శాఖల్లోనూ హుండీ పెట్టి డబ్బు సేకరణ చేయడం ఏమిటి? వీరు సివిల్ సర్వెంట్లా..? ఇది ధర్మమా? అని ప్రశ్నించారు. తనకి ఏర్పాటు చేసిన స్టేజ్ కూలిపోయిన ఘటనలో ఇద్దరు గాయపడ్డారని పేర్కొన్నారు.. ఈ విషయమై గవర్నర్, సీఎస్ లకు లేఖ రాస్తానన్నారు. ప్రభుత్వ అలసత్వమే దీనంతటికీ కారణం. అధికారులపై ప్రభుత్వానికి పట్ట లేకపోవడం వల్లే ఇలాంటి పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి అని ధ్వజమెత్తారు శాసనమండలి విపక్ష నేత బొత్స సత్యనారాయణ..