Minister Nara Lokesh: తెలుగు రాష్ట్రాలు అయిన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మధ్య కొనసాగుతున్న జల వివాదంపై మంత్రి నారా లోకేష్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. నీటి అంశాన్ని రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకోవడం సరికాదని హితవు పలికారు. తెలంగాణ దాటి ఆంధ్రప్రదేశ్‌కు వచ్చిన తర్వాత ప్రాజెక్టు కడితే తప్పేమిటి?.. మేం అదే నీటిని లిఫ్ట్ చేసి రాయలసీమకు ఇచ్చే ప్రయత్నం చేస్తున్నాం. తెలంగాణ వాటాకు ఎక్కడా చిల్లు పెట్టడం లేదు కదా? కనీసం కామన్ సెన్స్‌తో ఆలోచించాలి అని వ్యాఖ్యానించారు. నీటి కోసం చిన్న పరిమాణాలకైనా పెద్ద వివాదాలు జరిగాయని గుర్తుచేశారు మంత్రి. ఒక టీఎంసీ కోసం రాష్ట్రాల మధ్య, 10 టీఎంసీల కోసం దేశాల మధ్య కూడా గతంలో వివాదాలు నడిచాయి. సముద్రంలో కలిసే వరద నీటిని సద్వినియోగం చేసుకుంటే తప్పేమిటి? అని ప్రశ్నించారు.
Read Also: Chiranjeevi – Ravi Teja : అప్పుడు సంక్రాంతికి అన్నదమ్ముళ్లుగా వచ్చి.. ఇప్పుడేమో!
పట్టిసీమ ప్రాజెక్టుపై గత వైసీపీ ప్రభుత్వం వైఖరిని కూడా ఆయన విమర్శించారు లోకేష్.. పట్టిసీమ దండగ అన్న వైఎస్ జగన్.. ఐదేళ్లు అధికారంలో ఉండగానే ఆ ప్రాజెక్టును ఆపరేట్ చేశారు. 2020లో వైసీపీ అధికారంలో ఉన్నప్పుడే ఈ ప్రాజెక్టుపై స్టే వచ్చింది అని అన్నారు. మరోవైపు, తమ పర్యటనల ఖర్చుల విషయంలోనూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు మంత్రి లోకేష్. నా పర్యటనల్లో ఖర్చు పెట్టే ప్రతి రూపాయి మేమే పెట్టుకుంటున్నాం. ప్రభుత్వం నుంచి తీసుకోవడం లేదు. నాది, బాబు గారి క్రెడిట్ కార్డు బిల్లులు కూడా అమ్మ, బ్రహ్మణి కడుతున్నారు అని వెల్లడించారు.
108 అంబులెన్స్ సేవలు మూతపడిన సందర్భాన్ని ప్రస్తావించిన మంత్రి లోకేష్.. వైసీపీ హయాంలోనే 108 సేవలు మూతపడ్డాయి.. కానీ. NDA హయాంలో ఒక్క సేవ కూడా మూసివేయలేదు అని స్పష్టం చేశారు. మరోవైపు, విశాఖ ఉక్కు (స్టీల్ ప్లాంట్) ప్రైవేటీకరణపై వస్తున్న ప్రచారాన్ని ఖండించారు మంత్రి. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగదు.. ఉక్కు ప్లాంట్‌కు చెందిన ఒక్క ఎకరం కూడా ప్రైవేట్ లేదా ఇతర అవసరాలకు కేటాయించడం లేదు. అపోహలు వద్దు. పూర్తి ఉత్పత్తి సామర్థ్యంతో పనిచేయడానికి అందరూ సహకరించాలి అని తెలిపారు.
ఇక, విశాఖ ఎయిర్‌పోర్టుపై క్రెడిట్ ఎవరైనా తీసుకోవచ్చని మంత్రి పేర్కొన్నారు. ఎయిర్‌పోర్టు క్రెడిట్ తీసుకోండి.. నో ఇష్యూ.. కానీ, అమర్ రాజాను తరిమేసినందుకు, ఎయిర్‌పోర్టు భూములు వెనక్కి తీసుకున్నందుకు కూడా వైసీపీకి క్రెడిట్ ఇవ్వాలి అని వ్యాఖ్యానించారు. క్రీడాకారులను గుర్తించింది కూటమి ప్రభుత్వమే అని వెల్లడించారు. ఆస్ట్రేలియా యూనివర్సిటీతో అనుసంధానం చేసి విశాఖ ఎకనామిక్ రీజియన్ అభివృద్ధిని వేగవంతం చేయాలనే ప్రణాళికలో ఉన్నామని తెలిపారు. అమరావతి, శంషాబాద్ అభివృద్ధి నమూనాను పోల్చిన ఆయన, శంషాబాద్ ఎయిర్‌పోర్టు కట్టినప్పుడు రింగ్ రోడ్ నిర్మాణం జరగలేదు.. కానీ, ఇప్పుడు అమరావతిలో పనులు శరవేగంగా జరుగుతున్నాయి అని చెప్పారు లోకేష్.