Vizag: ప్రపంచరికార్డు సృష్టించేలా విశాఖలో అంతర్జాతీయ యోగా డే వేడుకల కోసం ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇవాళ్టి నుంచి జూన్ 21 వరకు యోగా మంత్ నిర్వహిస్తుండగా.. విశాఖలోని ఆర్కే బీచ్ లో వందల మందితో ప్రాథమిక వేడుకలు ప్రారంభమయ్యాయి. ప్రభుత్వ విప్ గణ బాబు, కలెక్టర్, సిటీ పోలీసు కమిషనర్ పాల్గొన్నారు. జూన్ 21 విశాఖలో జరిగే యోగా డే వేడుకలకు ప్రధాని నరేంద్ర మోడీ ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు.. వేలాది మందితో కలిసి ఆయన యోగాసనాలు వేయనున్నారు..
Read Also: Top Headlines @ 9 AM: టాప్ న్యూస్
‘యోగా ఫర్ వన్ ఎర్త్, వన్ హెల్త్’ ను ఈ ఏడాది యోగా దినోత్సవ థీమ్‌గా ప్రభుత్వం తీసుకుంది. అంతర్జాతీయ యోగా దినోత్సవ నిర్వహణను రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఇప్పటికే ఐదుగురు మంత్రులతో కమిటీ నియమించి బాధ్యతలు అప్పగించింది. ‘యోగాంధ్ర-2025’ థీమ్‌తో ప్రచారం చేపట్టి ప్రజలను సన్నద్ధం చేసేందుకు నెలరోజుల పాటు ప్రజలకు యోగాపై శిక్షణ ఇవ్వాలని ఆదేశించింది. జిల్లాలో గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా యోగా డేలో పాల్గొనే అంశంపై ప్రజల నుంచి రిజిస్ట్రేషన్లలు తీసుకోవాలని, అదే విధంగా స్కూళ్లు, కాలేజీల విద్యార్థులను, డ్వాక్రా మహిళలను, ప్రైవేటు ప్రభుత్వ సంస్థల ఉద్యోగులను, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులను, ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం చేయాలని నిర్దేశించింది. ఆర్కే బీచ్ నుంచి భీమిలి బీచ్ వరకు అన్ని చోట్లా ప్రజలు యోగాసనాలు వేసేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఆర్కే బీచ్ నుంచి పార్క్ హోటల్ వరకు, అదే విధంగా పార్క్ హోటల్ నుండి భీమిలి బీచ్ రోడ్ వరకు సుమారు 2.5 లక్షల మంది యోగాలో పాల్గొనే అవకాశం వుంది.