Minister Ramprasad Reddy: డీజిల్ బస్సులకు గుడ్‌బై చెబుతున్నాం.. ఇకపై కొనే ప్రతి బస్సు ఎలక్ట్రిక్ బస్సే ఉంటుందన్నారు రవాణా శాఖ మంత్రి రాంప్రసాద్ రెడ్డి.. విశాఖ ద్వారక ఆర్టీసీ బస్టాండ్‌లో రవాణా శాఖ మంత్రి రాంప్రసాద్ రెడ్డి ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించారు. బస్టాండ్‌లో అందిస్తున్న సౌకర్యాలు, సేవలపై ప్రయాణికులను ప్రత్యక్షంగా అడిగి తెలుసుకున్నారు. బస్సుల లభ్యత, శుభ్రత, టికెట్ వ్యవస్థ వంటి అంశాలపై ఆయన ప్రజల అభిప్రాయాలను సేకరించారు. ముఖ్యంగా ఫ్రీ బస్సు పథకం పై మహిళల అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మహిళలు మాట్లాడుతూ.. ఈ పథకం మా కోసం చాలా ఉపయోగపడుతోంది.. ప్రతిరోజూ ఉద్యోగాలు, కళాశాలకు ప్రయాణించడానికి ఇది చాలా ఉపశమనంగా ఉంది అని మంత్రికి తెలిపారు.
Read Also: Rakshmika : క్రేజ్ తో నెగిటివిటిని కూడా కొనితెచ్చుకుంటున్న రష్మిక మందన్న
ఈ సందర్భంగా మంత్రి రాంప్రసాద్‌రెడ్డి మాట్లాడుతూ.. స్త్రీ శక్తి పథకం కోసం APSRTC కు ప్రభుత్వం రూ.400 కోట్లను విడుదల చేసిందని తెలిపారు. ఈ పథకం పై తప్పుగా ప్రచారం చేసిన వారు ఇప్పుడు మౌనం వహిస్తున్నారని ఆయన వ్యాఖ్యానించారు. APSRTC ను బలోపేతం చేయడానికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు. డీజిల్ బస్సులకు గుడ్‌బై చెబుతాం.. ఇకపై ఎలక్ట్రిక్ బస్సులే కొనుగోలు చేస్తామన్నారు.. ఇకపై డీజిల్ బస్సులను కొనం… రాబోయే మూడు సంవత్సరాల్లో కొనబోయే ప్రతీ బస్సు ఎలెక్ట్రిక్ బస్సు మాత్రమే అన్నారు.. అంతేకాక భవిష్యత్తులో గ్రామీణ ప్రాంతాల్లో కూడా ఏసీ బస్సులు నడిపే ఆలోచన ప్రభుత్వం ముందుకు తీసుకెళ్తుందని చెప్పారు. మరోవైపు రాష్ట్రానికి పెట్టుబడుల పరంపర కొనసాగుతోందని తెలిపారు రాంప్రసాద్ రెడ్డి.. సీఎం చంద్రబాబు నాయకత్వంలో రాష్ట్రం వేగంగా అభివృద్ధి దిశగా సాగుతోందన్నారు. రాష్ట్రంలో పెట్టుబడులు భారీగా వస్తున్నాయని క్లారిటీ ఇచ్చారు. ప్రభుత్వం పూర్తిగా చిత్తశుద్ధితో పనిచేస్తుందని అన్నారు ఏపీ రవాణా శాఖ మంత్రి రాంప్రసాద్ రెడ్డి..