Chicken Price: నాన్‌వెజ్ లవర్స్‌కు షాక్ తగులుతోంది.. పండుగ సీజన్‌లో కోడి ధర కొండెక్కి కూర్చుంది.. కేజీ 300 రూపాయల గరిష్ట ధర పలుకుతోంది. ఈ స్థాయిలో చికెన్ రేట్లు పెరగడం ఏడాది తర్వాత ఇదే మొదటిసారి. గత మూడు నెలలుగా 260 రూపాయల దగ్గర కోడి మాంసం అమ్మకాలు జరిగాయి. డిమాండ్ కు సరిపడ ఉత్పత్తి లేని కారణంగా రెండు వారాల వ్యవధిలోనే కేజీకి 40 రూపాయలు పెరిగింది. రెండు రోజుల నుంచి బాయిలర్ చికెన్ 300 చేరింది. లైవ్ కోడి కేజీ 170.., ఫారం కోడి 180, శొంఠ్యాం కోడి 360 రూపాయల చొప్పున విక్రయిస్తున్నారు. సంక్రాంతి సీజన్ మొత్తం ఇదే ధరలు కొనసాగుతాయని వ్యాపార వర్గాలు చెబుతున్నాయి. డిమాండ్ కు సరిపడినంత కోళ్ల ఉత్పత్తి ప్రస్తుతం జరగడం లేదు. దీంతో మార్కెట్‌లో అవసరాల్లో సగం మాత్రమే వస్తున్నాయి. ఫలితంగా రేట్లు పెంచి అమ్మాల్సి వస్తుందని.. కేజీకి 300 రూపాయలు అంటే కస్టమర్లు కొనడానికి ఆసక్తి చూపించడం లేదని వ్యాపారులు చెబుతున్నారు.
Read Also: Pawan Kalyan: స్పెషల్ వీడియోను రిలీజ్ చేసిన పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్ బ్యానర్
ధర పెరిగినప్పటికీ సేల్స్ లేని కారణంగా వ్యాపారాలు దెబ్బతింటున్నాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ పరిస్ధితుల్లో చికెన్ ధరలను షాపుల ముందు పెట్టేందుకు ఇష్టపడ్డంలేదు వ్యాపారులు. ఇప్పటికే గుడ్డు ధర గుభేల్ మనిపిస్తుండగా… ఇప్పుడు చికెన్ తోడైంది. దీంతో సంక్రాంతికి మనస్ఫూర్తిగా కక్క ముక్క తినడం కష్టమేనంటున్నారు కొనుగోలుదారులు. ఉమ్మడి విశాఖ జిల్లాలో సుమారు 500 పౌల్ట్రీలు వుండగా వీటి ద్వారా 20 లక్షలకు పైగా కోళ్ల ఉత్పత్తి జరుగుతుంది. స్థానిక మార్కెట్ తో పాటు ఇతర జిల్లాలకు, రాష్ట్రాలకు విశాఖ నుంచి ఫార్మ్ కోళ్ల ఎగుమతి అవుతున్నాయి. ఏడాది క్రితం బర్డ్ ఫ్లూ కారణంగా ప్రతికూల పరిస్ధితులు తలెత్తాయి. కొనుగోళ్లు గణనీయంగా పడిపోవడంతో రైతులకు తీవ్రంగా నష్టం వాటిల్లింది. ఈ సీజన్‌లో కోళ్లు వెయిట్ పెరగకపోవడం ఒక కారణంగా చెబుతున్నారు. శీతాకాలంలో గరిష్టంగా రెండున్నర కేజీలు మాత్రమే కోడి బరువు పెరుగుతుందని ఆ సైజ్‌లో అమ్మకాలు చేస్తే పెద్దగా లాభాలు కనిపించవు అనే ఆలోచన వుంది. ఇక, ఫీడ్ ధరలు పెరగడం, కోళ్ల వ్యాధుల కారణంగా పౌల్ట్రీ ఇండస్ట్రీ మీద రైతుల్లో ఆసక్తి సన్నగిల్లింది. దీంతో కోళ్ళ పెంపకం తగ్గిపోగా… కార్పొరేట్ సంస్థలు అదే దారిలో ఆలోచించాయి. ఫలితంగా చికెన్ ధర పెరిగిపోయింది.
దీంతో వ్యాపారులు ఇతర రాష్ట్రాల నుంచి రప్పిస్తున్నారు. ప్రస్తుతం ఒడిశా నుంచి కోళ్లను దిగుమతి చేసుకుంటున్నప్పటికీ మార్కెట్‌లో ధరలు కనీసం రెండు వారాలు స్థిరంగా కొనసాగే అవకాశం వుందని వ్యాపార వర్గాలు చెబుతున్నాయి. ట్రిపుల్ సెంచరీ పెట్టి కోడి కొనాలంటే జనం వెనకాడే పరిస్ధితి. అలాగని, గుడ్డు, చేప, మటన్ ఇలా న్యూ ఇయర్‌లో నాన్‌వెజ్ ముట్టుకుంటేనే షాక్ కొడుతున్నాయి. మరి సంక్రాంతికి కక్క ముక్కా అంటే కష్టంగానే కనిపిస్తోంది అంటున్నారు నాన్ వెజ్ లవర్స్.