PM Modi Vizag Tour: భారత ప్రధాని నరేంద్రమోడీ పర్యటన కోసం విశాఖ నగరం ముస్తాబైంది. ఈ పర్యటనలో 2 లక్షల 8వేల కోట్ల విలువైన పథాకలకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేయనున్నారు ప్రధాని. ఈ పర్యటనను ప్రతిష్ఠాత్మకంగా తీసుకుని కూటమి ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్.. INSడేగా వద్ద ప్రధానికి స్వాగతం పలుకుతారు.. అక్కడి నుంచి రోడ్‌షో నిర్వహిస్తారు. సిరిపురం జంక్షన్ నుంచి ఆంధ్రాయూనివర్శిటీ గ్రౌండ్స్ వరకు సుమారు కిలో మీటరు పాటు ర్యాలీ సాగుతుంది. ఆ తర్వాత భారీ బహిరంగసభ నిర్వహిస్తారు. విశాఖ రైల్వేజోన్ సహా పలు కీలక పరిశ్రమలకు మోడీ శంకుస్థాపన చేయనున్నారు.
Read Also: AFI President: ఏఎఫ్‌ఐ అధ్యక్షుడిగా బహదూర్‌సింగ్!
ఆంధ్రాయూనివర్శిటీలో బహిరంగసభ కోసం భారీ ఏర్పాట్లు చేశారు. వేదికపై 13 మందికే అవకాశం కల్పించారు. ప్రధాని నరేంద్ర మోడీతో పాటు సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్, కేంద్ర, రాష్ట్ర మంత్రులు, ఎంపీలు వేదికపై కూర్చుంటారు. ప్రధాని ప్రసంగాన్ని కేంద్రమంత్రి రామ్మోహన్‌నాయుడు తెలుగులోకి అనువదిస్తారు. వేదికకు కుడివైపు ఆరు బ్లాకుల్లో మంత్రులు, రాష్ట్రస్థాయి నేతలు కూర్చునేందుకు వీలుగా ఏర్పాట్లు చేశారు. సభకు ఉత్తరాంధ్ర జిల్లాల నుంచి 3 లక్షల మంది తరలివస్తారని భావిస్తున్నారు. మూడోసారి ప్రధానిగా బాధ్యతలు చేపట్టాక మోడీ రాష్ట్రానికి రావడం ఇదే మొదటిసారి. గతేడాది నవంబర్‌లో పర్యటించాల్సి ఉన్నా తుపాను కారణంగా రద్దైంది. ఇక, వేదికపై కేంద్ర మంత్రి రామ్మోహన్నాయుడు, సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ, రాష్ట్ర మంత్రులు లోకేష్, సత్యకుమార్, BJP రాష్ట్ర అధ్యక్షురాలు, ఎంపీ పురందేశ్వరి, ఎంపీలు ఎం.శ్రీభరత్, సీఎం రమేష్, టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు, యలమంచిలి ఎమ్మెల్యే విజయ్ కుమార్ వేదికపై కూర్చొనే అవకాశం ఉంది.. ఈ సభలో ప్రధాని మోడీతో పాటు సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్, మంత్రి నారా లోకేష్, సీఎం రమేష్ ప్రసంగించనున్నట్టుగా తెలుస్తోంది.