Cyber Fraud: విశాఖపట్నంలో డిజిటల్ మోసాలతో కోట్లు కాజేస్తున్న సైబర్ ముఠా అక్రమాలు బయటపడింది. లేటెస్ట్ టెక్నాలజీని ఉపయోగించుకున్న ఈ ముఠా, ఓ ప్రైవేట్ వైద్యుడిని టార్గెట్ చేసుకుని.. సుమారు రూ. 2.61 కోట్లను కాజేసింది. ఈ ఘటనపై బాధితుడు సిటీ పోలీస్ కమిషనర్‌కు ఫిర్యాదు చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది. ఇక, సీపీ ఆదేశాలతో సైబర్ క్రైం పోలీసులు విచారణ చేయగా.. 2023 డిసెంబరులో ఆ డాక్టర్ ను BSE & NSE డీప్ ఇన్సైట్ -9827, షేర్ – 999 అనే వాట్సప్ గ్రూపుల్లో చేర్చినట్లు గుర్తించారు. స్టాక్ ట్రేడింగ్, ఇన్స్టిట్యూషనల్ స్టాక్స్, ఓటిసి స్టాక్స్, ఐపీఓలు లాంటి వాటిలో పెట్టుబడి పెడితే.. తక్కువ సమయంలోనే భారీ లాభాలు వస్తాయని నమ్మించారు.
Read Also: Congress Dharna: నేడు ఢిల్లీలో కాంగ్రెస్ మహాధర్నా.. హాజరుకానున్న ఏఐసీసీ అగ్రనేతలు!
దీంతో ఆ వైద్యుడు వారి మాటలు నమ్మి రూ. 2.61 కోట్లను బదిలీ చేశారు. ఇక, ఆ తర్వాత సైబర్ ముఠా ఆ డబ్బును క్రిప్టో కరెన్సీలోకి మార్చి, ఢిల్లీ పరిసర ప్రాంతాల్లో ఉన్న ఏటీఎంల ద్వారా నగదును విత్‌డ్రా చేసినట్లు సైబర్ క్రైమ్ పోలీసులు గుర్తించారు. అలాగే, విచారణలో ఈ ముఠాకు చెందిన ప్రధాన నిందితుడు ఉత్తరప్రదేశ్‌లోని లాజ్‌పత్ నగర్ సాహిదాబాద్‌కు చెందిన రాజీవ్ బన్సాల్ (సలీం ఖాన్)ను గుర్తించారు. అతడిని అరెస్ట్ చేసిన పోలీసులు, ల్యాప్‌టాప్‌లు, బ్యాంక్ ఖాతా పుస్తకాలు, స్టాంపులు, మొబైల్ ఫోన్లు, ఏటీఎం కార్డులను హస్తగతం చేసుకున్నారు.