Vijayawada Metro : విజయవాడ మెట్రో ప్రాజెక్ట్ భవితవ్యమేంటి..? కేంద్ర ప్రభుత్వం మౌనం దేనికి సంకేతం..? ఇతర రాష్ట్రాల మెట్రో ప్రాజెక్టులకు వరుసగా అనుమతులు ఇస్తున్న కేంద్రం… విజయవాడ మెట్రోకు మాత్రం ఎందుకు అనుమతి ఇవ్వడంలేదదన్నది ఎవరికీ అర్ధం కానీ పరిస్థితి. తాజాగా ఢిల్లీ మెట్రో మలివిడత ప్రాజెక్టుకు 12 వేల కోట్లకు పైగా నిధులకు కేంద్రం ఆమోదం తెలిపింది. అంతకుముందు పూణె, జైపూర్ మెట్రో రెండో దశలకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అయితే విజయవాడ మెట్రో డీపీఆర్‌ను ఏడాది క్రితమే సమర్పించినప్పటికీ ఇప్పటివరకు ఆమోదం రాకపోవడం అనేక సందేహాలకు తావిస్తోంది. విజయవాడ మెట్రో కోసం రెండు కారిడార్లకు టెండర్లు పిలిచేందుకు APMRC పూర్తిస్థాయిలో సిద్ధంగా ఉంది. అయినా కేంద్రం నుంచి స్పష్టమైన అనుమతులు లేకపోవడంతో ముందడుగు వేయలేకపోతోంది.
Read Also: Dhurandhar: బాక్సాఫిస్‌ను షేక్ చేస్తున్న ‘ధురంధర్’.. రూ.1000 కోట్ల క్లబ్‌లోకి రాయల్ ఎంట్రీ!
రాష్ట్ర విభజన చట్టంలో ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో కేంద్ర ప్రభుత్వం ఎందుకు ఆలస్యం చేస్తుందో తెలియని పరిస్థితి. ఏపీలో NDA కూటమి అధికారంలో ఉన్నప్పటికీ… ఎందుకంత నిర్లక్ష్యం, ఆలస్యం అనే చర్చ జరుగుతుంది. విజయవాడ కంటే అభివృద్ధిలో వెనుకబడిన అనేక నగరాల్లో మెట్రో ప్రాజెక్టులకు కేంద్రం అనుమతులు ఇచ్చింది. కానీ విజయవాడ విషయం వచ్చేసరికి మాత్రం ఏదో ఒక కారణం చూపుతూ ఫైళ్లను పక్కన పెట్టింది. నూతన మెట్రో పాలసీ వస్తే చూద్దాం అంటూ ఒకసారి, డీపీఆర్‌లో కొర్రీలు అంటూ మరోసారి విజయవాడ మెట్రోను కేంద్రం దాటవేసింది. ట్రాఫిక్ స్టడీ చేయాలంటూ షరతు పెట్టింది. ఆ అధ్యయనం కూడా పూర్తయ్యింది. అయినా ఫైళ్లు ముందుకు కదలడంలేదు. ఫైళ్లు కదలకపోవడం వెనుక కారణాలు ఏంటన్నది ఇప్పుడు పెద్ద ప్రశ్నగా మారింది. రాష్ట్ర విభజన హామీ మేరకు మెట్రోను కేంద్రమే చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వం, ఏపీ మెట్రో రైల్ కార్పొరేషన్ స్పష్టం చేసినా కేంద్రం మాత్రం అంగీకరించలేదు. 20:20 నిష్పత్తిలో కేంద్రం-రాష్ట్రం వాటా ఉండాలని, మిగిలిన 60 శాతం రుణం ద్వారా తీసుకోవాలని కేంద్రం స్పష్టంగా నిర్దేశించింది. దీంతో ఏపీ మెట్రో రైల్ కార్పొరేషన్ రుణాల సమీకరణ దిశగా అడుగులు వేసింది. చైనాకు చెందిన ఆసియాన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంక్ రుణం ఇవ్వడానికి ముందుకు వచ్చింది. వరల్డ్ బ్యాంక్, జైకా, ఏడీబీ, కేఎఫ్‌డబ్ల్యూ వంటి ప్రముఖ అంతర్జాతీయ ఆర్థిక సంస్థలు కూడా ప్రాజెక్టుకు ఓకే చెప్పాయి.
అయితే తక్కువ వడ్డీ, సులభమైన షరతులు, దీర్ఘకాల రుణ చెల్లింపు వెసులుబాటు ఉండటంతో ఆసియాన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంక్‌ను APMRC ఎంపిక చేసింది. విజయవాడలో కారిడార్-1, కారిడార్-2 పనుల కోసం సుమారు 5 వేల కోట్లతో టెండర్లు పిలిచారు. టెక్నికల్ బిడ్లను కూడా ఇప్పటికే తెరిచారు. నాలుగు ప్రముఖ సంస్థలు జాయింట్ వెంచర్లుగా ఏర్పడి టెండర్లు వేశాయి. కేంద్ర అనుమతులు వస్తే ఫైనాన్షియల్ బిడ్లను తెరవాలని నిర్ణయించారు. కానీ నెలలు గడుస్తున్నా APMRC అధికారులు ఎదురు చూపులు చూస్తూనే ఉన్నారు. అయినా కేంద్రం నుంచి ఇప్పటివరకు ఒక్క అనుమతీ రావడం లేదు.
ఏపీ మెట్రో రైల్ కార్పొరేషన్ అధికారులు అన్ని ప్రయత్నాలు చేసి విజయవాడ మెట్రో పనులు పట్టాలు ఎక్కించే వరకు తీసుకొచ్చారు. భూసేకరణకు అవసరమైన ప్రక్రియ కూడా దాదాపుగా పూర్తయ్యింది. ఇప్పుడు కావాల్సింది ఒక్కటే. కేంద్ర ప్రభుత్వ తుది అనుమతులు. విజయవాడ కంటే వెనుకబడి ఉన్న నగరాల మెట్రో డీపీఆర్‌లకు కేంద్రం వేగంగా ఆమోదం ఇస్తోంది. కానీ విజయవాడ మెట్రో డీపీఆర్ విషయంలో మాత్రం ఇప్పటికీ జాప్యం కొనసాగుతోంది. ఈ ఆలస్యం కారణంగా APMRCలో అసంతృప్తి పెరుగుతోంది. అన్ని సిద్ధంగా ఉన్న ప్రాజెక్టు కాగితాలకే పరిమితమవుతోంది. ఇటీవల పార్లమెంట్ ప్రశ్నోత్తరాల్లో విజయవాడ మెట్రోపై అడిగిన ప్రశ్నలకు కాలపరిమితి నిర్ణయించలేదని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ పరిస్థితుల్లో సీఎం చంద్రబాబు విజయవాడ మెట్రో ప్రాజెక్టుపై కేంద్ర ప్రభుత్వంపై
స్పష్టమైన ఒత్తిడి తీసుకురావాల్సిన అవసరం ఉంది అనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. లేదంటే విజయవాడ మెట్రో ప్రాజెక్టు మరోసారి ఆలస్యం అనే ముద్రతోనే మిగిలిపోతుందన్న ఆందోళన వ్యక్తమవుతోంది.