Vijayawada Metro Project: విజయవాడ మెట్రో రైలు ప్రాజెక్టుకు సంబంధించి పనులు వేగంగా సాగుతున్నాయి. ప్రాజెక్ట్ తొలి దశలో భూసేకరణపై ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి సారించింది. నగరంలోని వివిధ ప్రాంతాల్లో మెట్రో నిర్మాణానికి అవసరమైన భూమి వివరాలను అధికారులు ఖరారు చేశారు. విజయవాడలో మెట్రో రైలును రెండు కారిడార్లుగా అభివృద్ధి చేస్తున్నారు. పండిట్ నెహ్రూ బస్టాండ్ నుంచి గన్నవరం వరకు 26 కిలోమీటర్లు. పీఎన్‌బీఎస్ నుంచి పెనమలూరు వరకు 12.5 కిలోమీటర్లు నిర్మాణం చేస్తున్నారు. ఈ కారిడార్ల నిర్మాణం కోసం భూసేకరణ ప్రక్రియ వేగంగా జరుగుతోంది. కృష్ణా మరియు ఎన్టీఆర్ జిల్లాల్లో కలిపి 91 ఎకరాల భూమిని సేకరించనున్నారు. మెట్రో స్టేషన్ల కోసం విజయవాడ నగరంలో ప్రధాన ప్రాంతాల్లో భూసేకరణ చేపడుతున్నారు. మొగల్రాజపురం, మాచవరం, పటమట, గుణదల, నిడమానూరు, ఎనికేపాడు, ప్రసాదంపాడు ప్రాంతాల్లో మెట్రో స్టేషన్లు ఏర్పాటు చేయనున్నారు. మెట్రో నిర్మాణానికి 4.12 ఎకరాల భూమి అవసరంగా గుర్తించారు. విజయవాడ నగరంలోని పలు రెవెన్యూ వార్డులు పరిధిలో భూసేకరణ జరుగనుంది. మొత్తం 34 మెట్రో స్టేషన్లు నిర్మించనున్నారు. వీటిలో ఎన్టీఆర్ జిల్లాలో 20, కృష్ణా జిల్లాలో 14 స్టేషన్లు ఉండనున్నాయి..
Read Also: CS Shanthi Kumari: జిల్లా కలెక్టర్లతో సీఎస్ వీడియో కాన్ఫరెన్స్..
గన్నవరం ఎయిర్‌పోర్ట్ సమీపంలో 3 కిలోమీటర్ల మేర భూగర్భ మెట్రో మార్గం రూపొందించనున్నారు. మెట్రో కోసం ప్రత్యేకంగా కోచ్ డిపో నిర్మించనుండగా, దీనికి 50 ఎకరాల భూమి అవసరం అవచ్చు అని అధికారులు అంచనా వేశారు. విజయవాడ మెట్రో ప్రాజెక్ట్ కోసం ప్రభుత్వం రూ. 11,009 కోట్లు వ్యయం చేయనుంది. భూసేకరణ కోసం మాత్రమే రూ.1,152 కోట్లు ఖర్చు చేయనున్నట్లు అంచనా వేస్తున్నారు. ఒక్కో మెట్రో స్టేషన్ నిర్మాణానికి సుమారు రూ. 25 కోట్లు ఖర్చవుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. విజయవాడ మెట్రో ప్రారంభం అయితే.. నగరవాసులకు వేగవంతమైన, సౌకర్యవంతమైన ప్రయాణ సౌకర్యం లభించనుంది. ట్రాఫిక్ సమస్య తగ్గడంతో పాటు, నగర అభివృద్ధికి మెట్రో ఎంతో దోహదపడనుంది.మెట్రో ప్రాజెక్ట్ పనులు ప్రస్తుత వేగంతో కొనసాగితే, విజయవాడలో మెట్రో రైలు త్వరలోనే పట్టాలపై పరుగులు పెట్టనుంది అని ప్రజలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు..