Vallabhaneni Vamsi Case: వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత, గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మోహన్ కిడ్నాప్ కేసులో కీలకంగా ఉన్న సత్య వర్ధన్ 164 స్టేట్మెంట్ను పోలీసులకు న్యాయస్థానం సోమవారం అందజేసింది. గన్నవరం తెలుగుదేశం పార్టీ కార్యాలయంపై దాడి కేసులో సత్య వర్ధన్ ఫిర్యాదుదారుడుగా ఉన్నాడు. ఫిబ్రవరి 10వ తేదీన ఈ కేసుతో తనకు సంబంధం లేదంటూ సత్య వర్ధన్ మేజిస్ట్రేట్ ముందు అఫిడవిట్ దాఖలు చేశాడు. ఆ తర్వాత రోజునే సత్య వర్ధన్ కిడ్నాప్ కు గురవటంతో నమోదైన కేసులో వంశీని అరెస్టు చేశారు. ఈ నేపథ్యంలో సత్య వర్ధన్ మేజిస్ట్రేట్ ముందు జరిగిన ఘటనకు సంబంధించి 164 స్టేట్మెంట్ ఇచ్చాడు.
Read Also: UAE: యూఏఈలో మరణశిక్ష పడిన యూపీ మహిళకు ఉరిశిక్ష అమలు
దర్యాప్తులో భాగంగా ఈ స్టేట్మెంట్ తమకు కావాలని పోలీసులు పిటిషన్ దాఖలు చేయటంతో దాన్ని పోలీసులకు న్యాయమూర్తి అందజేశారు. ఇక ఈ కేసులో అరెస్ట్ అయిన ఏ4 వీర్రాజు, ఏ10 వంశీ బాబులను రెండు రోజులు కష్టడికి ఇస్తూ న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది. రేపు, ఎల్లుండి ఉదయం పది నుంచి ఐదు గంటల వరకు నిందితులను పోలీసులు విచారించనున్నారు. ఇక, తనను బ్యారక్ మార్చాలని వంశీ దాఖలు చేసిన పిటిషన్ పై విచారణ జరిపిన న్యాయస్థానం కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ.. విచారణ రేపటికి వాయిదా వేసింది.