ఇండియా 76వ గణతంత్ర దినోత్సవం జరుపుకోనుంది. దేశవ్యాప్తంగా రిపబ్లిక్ డే సంబరాలు ఘనంగా జరగనున్నాయి. మరోవైపు.. విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో 76వ గణతంత్ర దినోత్సవ వేడుకలకు సర్వం సిద్ధమైంది. రిపబ్లిక్ డే సందర్భంగా రేపు ఉదయం 9 గంటలకు గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్.. జాతీయ పతాకాన్ని ఆవిష్కరించనున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. పలు శాఖల మంత్రులు, ప్రధాన కార్యదర్శులు కూడా హాజరుకానున్నారు. అనంతరం గవర్నర్ సాయుధ దళాల గౌరవ వందనం స్వీకరించనున్నారు. స్టేడియంలో కవాతులో పోలీసులు, ఇండియన్ ఆర్మీ, ఎన్సీసీ దళాలు, స్కౌట్స్ అండ్ గైడ్స్ బృందాలు పాల్గొననున్నాయి. కార్యక్రమంలో భాగంగా పలు ప్రభుత్వ శాఖల శకటాల ప్రదర్శన నిర్వహించనున్నారు. ఎటువంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టారు.
మరోవైపు.. రాష్ట్ర శాసన మండలి, అసెంబ్లీ, సచివాలయం, హైకోర్టుల్లో గణతంత్ర దినోత్సవ వేడుకలు నిర్వహించనున్నారు.రేపు ఉదయం 8 గంటలకు అసెంబ్లీ భవనం ప్రాంగణంలో శాసన మండలి అధ్యక్షులు కె.మోషేన్ రాజు పాల్గొని జాతీయ జెండాను ఆవిష్కరించనున్నారు. ఉ.8.15 గం.లకు అసెంబ్లీ భవనం వద్ద శాసన సభాపతి చింతకాయల అయ్యన్న పాత్రుడు జాతీయ జెండాను ఆవిష్కరించనున్నారు. సచివాలయం మొదటి బ్లాకు వద్ద ఉదయం 7.30కు గణతంత్ర దినోత్సవ వేడుకల్లో సీఎస్ విజయానంద్ పాల్గొననున్నారు. నేలపాడులోని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం వద్ద ఉ.10 గం.లకు రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్ సింఘ్ ఠాకూర్ జాతీయ జెండాను ఆవిష్కరించనున్నారు.
Read Also: Nuvve Kavali: మూడు దేశాల్లో 50 లక్షల ఖర్చుతో మెహబూబ్, శ్రీ సత్యల ఆల్బమ్ సాంగ్