ప్రభుత్వ చిత్తశుద్ధిని నిరూపించుకోవాలంటే ఉద్యోగులకు పాత జీతాలే ఇవ్వాలని పీఆర్సీ సాధన సమితి నేత వెంకట్రామిరెడ్డి అన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. ఉద్యమానికి సహకరిస్తున్న ట్రెజరీ ఉద్యోగులు, డీడీఓలపై ప్రభుత్వం ఒత్తిడి తెస్తోందని వారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తుందని వెంకట్రామిరెడ్డి అన్నారు. పాత జీతమే ఇవ్వాలని ప్రతి ఉద్యోగి డీడీఓలు.. హెచ్వోడీల వద్దకు వెళ్లి రాతపూర్వకంగా కోరాలన్నారు.
దీని నిమిత్తం ఓ ప్రోఫార్మా రూపొందించామని తెలిపారు. చర్చలకు వచ్చే విషయంలో మా డిమాండ్లు ఏంటో ప్రభుత్వానికి తెలుసునన్నారు. మా ప్రతినిధి బృందం వచ్చి మా అభిప్రాయాన్ని చెప్పాం. కానీ ప్రభుత్వం నుంచి ఎలాంటి నిర్ణయం రాలేదన్నారు. ప్రభుత్వం పాత జీతాలు ఇస్తేనే మాకు నమ్మకం కలుగుతుందన్నారు.మేం ఉద్యమ కార్యాచరణ ఇచ్చాం.. మాతో కాకుండా వేరే ఉద్యోగ సంఘాలు ఎవరైనా వస్తే వారితో ప్రభుత్వం చర్చలు జరపొచ్చు.. ఇబ్బందేమీ లేదు. వేరే ఉద్యోగ సంఘాలతో చర్చించుకుని కట్టడి చేయాలనుకుంటే చేసుకోవచ్చు అన్నారు.