మనిషికి శ్వాస ఎంత అవసరమో.. భాష కూడా అంతే అవసరం అని నొక్కి చెప్పారు భారత మాజీ ఉపరాష్ట్రపతి ఎం. వెంకయ్యనాయుడు.. విజయవాడలో జరుగుతోన్న 5వ ప్రపంచ తెలుగు రచయితల మహాసభలకు ముఖ్యఅతిథిగా హాజరయ్యారు వెంకయ్యనాయుడు.. ఇక, ప్రపంచ తెలుగు రచయితల సంఘం గౌరవ అధ్యక్షుడు మండలి బుద్ధప్రసాద్, కొలకలూరి ఇనాక్, లావు అంజయ్య చౌదరి, పలువురు ప్రముఖ రచయితలు పాల్గొన్నారు.. ఈ సందర్భంగా వెంకయ్యనాయుడు మాట్లాడుతూ.. మనిషికి శ్వాస ఎంత అవసరమో భాష కూడా అంతే అవసరం అన్నారు.. ఇక, భాషను బతికించుకోవటానికి ఐదు అంశాలను పాటించాలని సూచించారు.. అవి ప్రాథమిక విద్య మాతృ భాషలోనే ఉండాలి.. ప్రజల భాషే పరిపాలనా భాష కావాలి.. న్యాయస్థానాల్లో వాదనలు, తీర్పులు తెలుగు భాషలోనే ఉండాలి.. మాతృ భాషలోనే ఉన్నత సాంకేతిక విద్య ఉండాలని సూచించారు వెంకయ్యనాయుడు.
మరోవైపు, ప్రపంచలో ఏ దేశంలో అయినా ప్రాథమిక విద్య మాతృభాషలోనే జరుగుతుందని తెలిపారు తానా ప్రపంచ సాహిత్య వేదిక, అధ్యక్షులు తోటకూర ప్రసాద్.. ఆంగ్లం నేర్చుకుంటేనే ఉద్యోగాలు వస్తాయి అని భావించడం అపోహ మాత్రమేనని కొట్టిపారేసిన ఆయన.. మాతృబాష విషయంలో ప్రభుత్వాలు ఆలోచించాలని సూచించారు. ఇక, ఫ్రాన్స్ తెలుగు ఆచార్యులు ఆచార్య డానియల్ నేగర్స్ మాట్లాడుతూ.. తెలుగు భాషతో బుర్రకథలపై పరిశోధన సందర్భంగా పరిచయం ఏర్పడింది.. తర్వాత ఫ్రాన్స్, తెలుగు నిఘంటువు రూపొందించే అవకాశం వచ్చిందన్నారు.. యూరోప్ దేశాల్లో అక్కడి మాతృబాషలకు ఎంతో ప్రాధాన్యం ఇస్తున్నారన్న ఆయన.. తెలుగును ప్రోత్సహించకపోతే మన సంస్కృతి, నాగరికతకు అన్యాయం చేసినట్టు అవుతుందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.