నాడు మద్యపాన నిషేదమన్న జగన్.. ఇప్పుడు టార్గెట్లు పెట్టి మరీ మద్యం అమ్మిస్తున్నారంటూ మరోసారి వైసీపీ ప్రభుత్వంపై తెలుగు మహిళా రాష్ట్ర అధ్యక్షురాలు వంగలపూడి అనిత నిప్పులు చెరిగారు. మహిళలపై రోజూ దారుణాలు జరుగుతున్నా.. జగన్ మాత్రం నేను సీఎంను కాదు, నాకు సంబంధం లేదన్నట్టు వ్యవహరిస్తున్నారని ఆమె విమర్శించారు. వైసీపీ నేతలు, వాలంటీర్లే కాలకేయుల్లా.. మారి మహిళలపై అత్యాచారాలు, దాడులకు తెగబడుతున్నారి ఆమె మండిపడ్డారు. వైసీపీ 3 ఏళ్ల పాలనపై కేకులు కట్ చేస్తున్న వైసీపీ నేతలంతా.. జగన్ పాలనలో తమ ఇంట్లో మహిళలకు ఎంత భద్రత ఉందో ఆత్మ పరిశీలన చేసుకోవాలని ఆమె ఘాటుగా వ్యాఖ్యానించారు.
ఎన్నికలకు ముందు అందరికీ అమ్మ ఒడి ఇస్తామని చెప్పిన భారతి.. అమ్మ ఒడిని ఒక్కరికే పరిమితం చేస్తే ఎందుకు మాట్లాడటం లేదని ప్రశ్నించారు. ఒకటి రెండు రేపులకే రాద్దాంతమా అని మంత్రి రోజా అనటం సిగ్గుచేటని, అత్యాచారాలను ఈజీగా తీసుకునే మానసిక స్దైర్యం రోజాకు ఉన్నంతగా ప్రపంచంలో ఏ మహిళలకు ఉండదని ఆమె స్పష్టం చేశారు. ఇన్ని అత్యాచారాలు జరుగుతున్నా.. సీఎం నోరు మెదపటం లేదంటే ఆయన కెబినెట్లో ఉన్న మహిళా మంత్రులు తక్షణమే రాజీనామా చేయాలని ఆమె డిమాండ్ చేశారు.