ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం అమలు విషయంలో ఇప్పటికీ అనేక సందేహాలు ఉన్నాయి.. ఆ చట్టంలోని మెజార్టీ అంశాలు అమలుకు నోచుకోలేదని రెండు రాష్ట్రాలు చెబుతూ వస్తున్నాయి.. అయితే, దీనిపై క్లారిటీ ఇచ్చింది కేంద్ర హోంశాఖ.. “ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం” అమలు గురించి టీడీపీ ఎంపీ రామ్మోహన్ నాయుడు లోక్‌సభలో ప్రశ్నించారు.. విభజనచట్టంలో పొందుపరచిన అంశాలు అన్నీ నెరవేర్చారా? లేదా? లేకపోతే అమలుకు ఎటువంటి చర్యలు తీసుకున్నారని అడిగిన ప్రశ్నకు సమాధానం ఇచ్చిన కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిత్యానందరాయ్.. ఆ చట్టంలోని చాలా అంశాలు అమలయ్యాయి.. మరికొన్ని అమలుదశలో ఉన్నాయన్నారు..
మౌలిక సదుపాయాల ప్రాజెక్టులు, విద్యాసంస్థల ఏర్పాటుకు విభజన చట్టం ప్రకారం 10 సంవత్సరాల కాలపరిమితి ఉందన్నారు నిత్యానందరాయ్.. విభజన చట్టంలోని అంశాల అమలు పురోగతిని ఎప్పటికప్పుడూ కేంద్ర హోంశాఖ సమీక్షిస్తుందన్న ఆయన.. విభజన చట్టంలోని అంశాల అమలుకు ఇప్పటివరకు 25 సమీక్షా సమావేశాలు జరిగాయన్నారు.. ఏకాభిప్రాయంతో రెండు రాష్ట్రాల మధ్య ఉన్న సమస్యలను పరిష్కరించేందుకు ప్రయత్నం చస్తున్నట్టు లోక్‌సభలో వెల్లడించారు.